వారం రోజుల్లో గోదావరి నీరు

21 Apr, 2016 01:19 IST|Sakshi

ఏటూరునాగారం :  గోదావరి నది నుంచి వారం రోజుల్లో వరంగల్ నగర ప్రజలకు నీరు అందుతుందని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ చెప్పారు.  ఏటూరునాగారం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల పథకం వద్ద గోదావరి నీటిని ఫోర్‌బేలకు మళ్లించడానికి ఎమర్జెన్సీ మోటార్ల ఏర్పాట్ల పనులను బుధవారం ఆయన వరంగల్ మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి పరిశీలించారు. వేసవిలో ప్రజల గొంతు ఎండకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి రూ.8.69 కోట్లతో ఎమర్జెన్సీ పంపింగ్ సిస్టం ఏర్పాటు చేసిందన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలోని మొదటి దశ ఒక మోటార్ ద్వారా బీంఘణ్‌పూర్, పులకుర్తి ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్‌లో 350 ఎంసీఎఫ్‌టీ నీటిని నిల్వ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందు కోసం దేవాదుల వద్ద ప్రస్తుతం పారుతున్న గోదావరిలో 2300 హార్స్‌పవర్ సామర్థ్యంతో 32 మోటార్లను అమర్చి దేవాదుల ఫోర్‌బేలకు నీటిని మళ్లిస్తామని, ఫోర్‌బేల నీరు బయటకు వెళ్లకుండా 75 మీటర్ల క్రాస్ బండ్‌ను మట్టి, ఇసుకబస్తాలతో నిర్మిస్తున్నామని చెప్పారు.


23రోజుల పాటు నిరంతరంగా ఒక మోటారు నడవడం ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్‌లో 350 ఎంసీఎఫ్‌టీ నీరు పెరుగుతుందన్నారు. దీంతో నగర ప్రజలకు జూలై 30 వరకు తాగునీటిని రోజు తప్పించి రోజు ఇస్తామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు, దేవాదుల ఇరిగేషన్ ఇంజనీర్లు సమన్వయంతో ఈ ఎమర్జెన్సీ పంపింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని, ఇసుక ఒడ్డు వెంట 16, గోదావరి నదిలో 16 మోటార్లను అమర్చనున్నామని తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు గోదావరిలోని నీరు దేవాదుల ఫోర్‌బేలకు చేరుతుందన్నారు. ఈనెల 27న భీంఘణ్‌పూర్‌కు దేవాదుల నీరు చేరే విధంగా కావాల్సిన పనులు పూర్తి చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మేయర్ వెంట వరంగల్ కార్పొరేషన్ ఎస్‌ఈ బాల మునియర్, ఈఈ లింగమూర్తి, ఇరిగేషన్ డీఈఈ రాంప్రసాద్, పవర్‌సోలేషన్ కాంట్రాక్టు సంస్థ ఉమామహేశ్వర్ ఉన్నారు.

 
75 రోజుల పాటు పంపింగ్

వరంగల్ నగరల ప్రజలకు 75 రోజుల నీటిని అందించడానికి ప్రభుత్వం దేవాదుల వద్ద ఎమర్జెన్సీ పంపింగ్ సిస్టం చేపట్టింది. ఇందు కోసం రూ.8.69 కోట్లతో 70 హార్స్‌పవర్ సామర్థ్యం గల 16 హారిజంటల్ పంప్స్(మోటార్లు) ఒడ్డుపైన, 50 హార్స్‌పవర్ సామర్థ్యం గల మరో 16 సబర్సబుల్ మోటార్లు గోదావరి మధ్యలో రెండు ఇనుప పడవలపై అమర్చనున్నారు.

 
మోటార్లు నడిచేందుకు కావాల్సి విద్యుత్ కోసం  500 కిలోవాట్స్ సామర్థ్యం గల విద్యుత్ ట్రాన్స్‌పార్మర్లు నాలుగు ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం రూ.5.39 కోట్లు విద్యుత్ శాఖకు చెల్లించనున్నారు. రూ.3.30 కోట్లతో మోటార్లు, పైపులైన్, క్రాస్‌బండ్, నీటి మళ్లింపు, అమరిక పనులు చేపట్టారు. వీటితోపాటు రెండు 150 హెచ్‌పీ మోటార్లు, ఒక 100 హెచ్‌పీ గల మోటార్‌ను కూడా అదనంగా అమర్చనున్నారు.

 
దొంగతనం జరగకుండా ప్రత్యేక చర్యలు

దేవాదుల పైపులైన్ నుంచి భీంఘన్‌పూర్ మధ్యలోని గ్రామాల్లో కొంత మంది పైపులకు లీకేజీలు పెడుతూ నీటిని తోడుకుంటున్నారని ఇరిగేషన్ డీఈఈ రాంప్రసాద్ వరంగల్ మేయర్ నరేందర్‌కు వివరించారు. దీనివల్ల తమకు కావాల్సిన నీటిని పంపింగ్ చేయడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఈవిషయంపై స్పందించిన మేయర్ నరేందర్ ఎక్కడ కూడా పైపులైన్‌కు లీకేజీలు పెట్టకుండా పోలీసు భద్రత ఏర్పాట్లు చేయించే విధంగా చూస్తామన్నారు. ఎక్కడ ఎలా నీటి దొంగతనం జరుగుతుందనే పూర్తి సమాచారం తమకు ఇవ్వాలని ఆదేశించారు.

 
ఎల్‌ఎండీ, ఎస్పారెస్పీ ఎండడం వల్లనే...

ప్రతి ఏడు నగరానికి లోయర్ మిడ్‌మానేర్‌డ్యాం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల నుంచి మూడు నెలల పాటు దశల వారీగా కాల్వల ద్వారా నీరు వచ్చేదని వరంగల్ మున్సిపల్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ తెలిపారు. ఈ ఏడాది ఆ రెండు ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం శ్రీహరి చొరవతో ఈ విధంగా ఎమర్జెన్సీ సిస్టంను ఏర్పాటు చేశామన్నారు. దేవాదుల పైపులైన్ ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి 350 ఎంసీఎఫ్‌టీల నీరు చేరుతుందన్నారు. ఇప్పటి వరకు 250 ఎంసీఎఫ్‌టీల నీరు ధర్మసాగర్‌లో నిల్వ ఉన్నదని వెల్లడించారు. సుమారు 10 నుంచి 12 లక్షల మంది ప్రజలకు ఈ నీరు సరఫరాా చేయవచ్చని వివరించారు.      

మరిన్ని వార్తలు