ఏడాదిలోగా తెలంగాణ భూసార పటం

13 Sep, 2014 01:41 IST|Sakshi
ఏడాదిలోగా తెలంగాణ భూసార పటం

కర్ణాటక తరహాలో రూపకల్పనకు కేసీఆర్ నిర్ణయం
కోటి ఎకరాల సాగు భూముల సమగ్ర సమాచారం
భారతీయ విత్తన భాండాగారంగా తెలంగాణ      
ఇక్రిశాట్ ప్రతినిధులతో భేటీలో ముఖ్యమంత్రి వెల్లడి

 
హైదరాబాద్: ఏడాదిలోగా కోటి ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన సమగ్ర వివరాలతో కర్ణాటక రాష్ట్రం తరహాలో తెలంగాణ భూసార పటం(తెలంగాణ సాయిల్ ఫర్టిలిటీ అట్లాస్) రూపొందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు ఇక్రిశాట్ సహకారాన్ని తీసుకుంటామని ప్రకటించారు.  ఇక్రిశాట్ ఆధ్వర్యంలోనే కర్ణాటకలో భూసార పరీక్షలు జరిగాయని.. ఈ సంస్థ అనుభవాన్ని, విజ్ఞానాన్ని తెలంగాణకు కూడా వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ విలియం డి.దార్, గ్లోబల్ లీడర్ దిలీప్ కుమార్, డెరైక్టర్ సుహాస్ పి.వాణి శుక్రవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణను భారతీయ విత్తన భాండాగారంగా మార్చే ఆలోచన ఉందని ఈ సందర్భంగా సీఎం వారితో పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా రెండో హరిత విప్లవానికి అడుగులు పడుతున్న తరుణంలో సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తెలంగాణ ప్రాంత రైతులకు ఉపయోగపడే వ్యవసాయ విధానం అవలంబించాలన్నది తన ఉద్దేశమని తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించే పద్ధతులను వారిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో భూసార పరీక్షలు నిర్వహించాల్సిన పద్థతులపై కూడా ప్రాథమికంగా చర్చలు జరిపారు. భూసార పటాన్ని రూపొందించిన తర్వాత ఆ సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇది రైతులకే కాకుండా ప్రభుత్వానికి, వ్యవసాయ పరిశోధకులకు, వ్యవసాయ అధికారులకు, సంప్రదాయ ఎరువుల ఉత్పత్తిదారులకు, చివరకు వ్యవసాయ విధానాన్ని ఖరారు చేసే శాసనకర్తలకు కూడా కరదీపికలాగా పనిచేస్తుందని సీఎం తెలిపారు.
 
 
 

మరిన్ని వార్తలు