తప్పెవరిది.. శిక్ష ఎవరికి..?

21 Dec, 2014 00:12 IST|Sakshi
తప్పెవరిది.. శిక్ష ఎవరికి..?

 బషీరాబాద్: పింఛన్ కావాలంటే ఆధార్ కార్డు కావాల్సిందే.. ఆధార్ కార్డు కావాలంటే వేలిముంద్రలు, కంటి రెటినా తప్పనిసరి. మరి ఈ రెండూ లేని వికలాంగుల పరిస్థితి గురించి ప్రభుత్వం ఆలోచించలేదు. ఈ రెండూ లేకుండా ఆధార్ కార్డు పొందడం అసాధ్యం. అది లేకుండా పింఛన్ ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించడం దారుణమని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డులు ఇవ్వలేదని వికలాంగులకు రేషన్ సరుకుల పంపిణీ ఇప్పటికే నిలిచిపోయింది. ప్రస్తుతం వారు పింఛన్‌లకు కూడా దూరమవుతున్నారు. ఆధార్ ఉంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయని అధికారులు నిర్ధాక్షిణ్యంగా చెబుతున్నారు.

మండలంలో ఇప్పటి వరకు 80 శాతం వరకు ఆధార్ ప్రక్రియ పూర్తయింది. అయితే కంటిచూపు లేనివారు, చేతులు లేనివారికి ఆధార్ కార్డు అందించలేమని అక్కడి సిబ్బంది తిరిగి పంపిస్తున్నారు. ఇటువైపేమో ఆధార్ కార్డు ఉంటేనే పింఛన్ అంటూ ప్రభుత్వం కొత్త రాగం అందుకుంది. మరి ఆధార్ కార్డు పొందలేని వారి పరిస్థితి గురించి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించడం లేదు.

ఈ విషయమై అధికారులను అడిగితే నిబంధనల మేరకే తాము నడుచుకుంటున్నామని, తాము ఏమీ చేయలేమని చెప్పి పంపిస్తున్నారని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జీవన్గి దామర్‌చెడ్, ఎక్మాయి, మైల్వార్‌తోపాటు పలు గ్రామాలలో వికలాంగులు ఇదే సమస్యతో సతమతమవుతున్నారు. కళ్లులేని వారికి, చేతులు లేని వారికి ప్రత్యేక ఆధార్ కార్డులు అందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు