ఏ కష్టమ్స్ లేకుండా..

10 Sep, 2014 23:15 IST|Sakshi

విలువైన వస్తువులను విదేశాలకు తీసుకెళ్తే..
 ఏవైనా విలువైన వస్తువులు, బంగారు నగలను విదేశాలకు తీసుకు వెళ్తున్నారా? తిరిగి వచ్చేటప్పుడు వాటిని మళ్లీ భారత్‌కు తీసుకు రావాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్స్‌పోర్ట్ సర్టిఫికెట్ పొందాల్సిందే. ఈ సర్టిఫికెట్‌ను విమానాశ్రయాల్లోని ఇంటర్నేషనల్ డిపార్చర్ హాళ్లలోని కౌంటర్లలో మంజూరు చేస్తారు.

 దీన్ని పొందడానికి ముందుగా అధీకృత వాల్యూవర్‌తో వాటి విలువకు సంబంధించిన సర్టిఫికెట్ పొందాలి. ఎక్స్‌పోర్ట్ సర్టిఫికెట్ తీసుకుంటే తిరుగు ప్రయాణంలో ఆయా వస్తువులపై సుంకం చెల్లించక్కర్లేదు. లేదంటే ఇబ్బంది తప్పదు.
 
బంగారంపై ఇలా..
 ప్రయాణికులు ఎవరైనా ఒక కేజీ వరకు బంగారం కడ్డీలు/ నాణాలు కొన్ని నిబంధనలకు లోబడి వెంట తెచ్చుకోవచ్చు.
 ప్రయాణికులు భారతీయ లేదా భారత సంతతి పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి.
 కనీసం ఒక ఏడాది విదేశాల్లో ఉండి భారత్‌కు తిరిగి వస్తున్నట్లు ఆధారాలు తప్పనిసరి.
 తయారీదారుల పేర్లు, సీరియల్ నెంబర్లు, బరువును సూచించే ముద్రలు ఉన్న బంగారం కడ్డీలపై నిర్ణీత దిగుమతి సుంకం వసూలు చేస్తారు.
 ఇవేవీ లేని వాటిపై అదనపు సుంకం ఉంటుంది. విదేశాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం ఉండి భారత్‌కు తిరిగి వచ్చే పురుషులు సగటున రూ.50 వేల విలువ చేసే బంగారు ఆభరణాలను ఉచితంగా తెచ్చుకోవచ్చు.
 మహిళలైతే రూ.లక్ష విలువైన ఆభరణాలు తెచ్చుకునే అవకాశం ఉంది. ముత్యాలు, విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలు మినహా ఇతర ఆభరణాలను పరిమితికి మించి తెచ్చుకుంటే సుంకం చెల్లించాల్సి ఉంటుంది.
 
 గమనించాల్సిన ఇతర అంశాలు..
 కస్టమ్స్, ఇతర సుంకాలను కేవలం స్థానికంగా మార్పిడికి అవకాశం ఉన్న కరెన్సీ రూపంలోనే చెల్లించాలి.
 ఈ సుంకాలు, నిబంధనలు పరిస్థితులకు అనుగుణంగా మారే అవకాశం ఉంది.
 కస్టమ్స్ నిబంధనలపై పూర్తి సమాచారం కోసం www.cbec.gov.in వెబ్‌సైట్‌ను చూడండి.

మరిన్ని వార్తలు