తెలంగాణకు నష్టం జరగనివ్వొద్దు

2 Oct, 2014 00:55 IST|Sakshi
తెలంగాణకు నష్టం జరగనివ్వొద్దు

సీఎం కేసీఆర్‌కు మల్లు స్వరాజ్యం సూచన

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరగకుండా, అట్టడుగువర్గాల ప్రజలకు తిండి, బట్ట, ఇళ్లు వంటి కనీస అవసరాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం సూచించారు. బుధవారం సెక్రటేరియట్‌లో తెలంగాణ సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సాధికార బతుకమ్మ సంబురాల ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘కేసీఆర్‌కు తెల్వక రా రమ్మని కంపెనీలను పిలుస్తున్నడు. వచ్చే కంపెనీలేమో వందల ఎకరాలు కావాలంటున్నాయి. దళితులకు పంపిణీకి 3 ఎకరాల భూమి అంటేనే దొరకడం లేదు. అభిమన్యుడిగా కేసీఆర్ ఇరుక్కుపోతాడేమో ఆలోచించుకోవాలి. భద్రంగా వ్యవహరించాలి’ అని వ్యాఖ్యానించారు.

సాయుధపోరాట పాటలను ఆలపించి సభికులను ఉత్తేజపరిచారు.ప్రొఫెసర్ రమా మెల్కొటే, ఎవరెస్ట్‌ను అధిరోహించిన పూర్ణ, ప్రొఫెసర్ కె.లక్ష్మి, ప్రొఫెసర్ అండమ్మ, దేవకీదేవి, రత్నమాలను  డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి సన్మానించారు. సంఘం అధ్యక్షురాలు జె.సుభద్ర మాట్లాడుతూ బతుకమ్మను రాజకీయం చేయొద్దన్నారు. అంతకుముందు సచివాలయ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు.
 ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో భాష, జాతి, సంస్కృతిపై దాడి జరిగిందన్నారు. బతుకమ్మ ఉద్యమస్ఫూర్తిని రగిలించిందన్నారు. కరీంనగర్ జిల్లాలో ఎస్పీ భార్య, హోంగార్డు భార్య కలిసి బతుకమ్మ ఆడారంటే.. ఈ పండుగ అంతరాలను ఏవిధంగా చెరిపేసిందో అర్థమవుతుందన్నారు.
 

మరిన్ని వార్తలు