పరీక్ష రాయకున్నా పాస్!

21 May, 2015 03:05 IST|Sakshi
పరీక్ష రాయకున్నా పాస్!

శాతవాహన యూనివర్సిటీ : తప్పులమీద తప్పులు చేయడం శాతవాహన యూనివర్సిటీ పరీక్షల విభాగానికి అలవాటుగా మారింది. బీఈడీ విద్యార్థులకు ఒక ఫెయిల్ మెమో, మరో పాస్ మెమో ఇచ్చి కన్సాలిడేటెడ్ మెమో ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్న వర్సిటీ తాజాగా పరీక్ష రాయకున్నా విద్యార్థులను పాస్ చేస్తూ మెమోలు ఇస్తోంది. డిగ్రీలో విద్యార్థులకు ఇంటర్నల్‌గా పరీక్ష నిర్వహణ ఉంటుంది. ప్రశ్నపత్రాలు యూనివర్సిటీ నుంచి పంపిస్తారు.

ఎలాగూ పరీక్షలను యూనివర్సిటీ అధికారులు తనిఖీ చేయబోరని కాబోలు... పలు కళాశాలలలు కనీసం పరీక్షలు కూడా నిర్వహించలేదు. పరీక్ష రాయకుండానే ఏకంగా 300 మంది విద్యార్థులు పాసైనట్లు వెల్లడైంది. ‘పరీక్షే రాయలేదు... ఎలా పాసయ్యానని సదరు విద్యార్థులే నోరు వెళ్లబెట్టే వింత పరిస్థితి దాపురించింది.
 
ఇంటర్నల్స్ ఇష్టారాజ్యం
డిగ్రీలో విద్యార్థులకు ఆయా కోర్సు మెయిన్ సబ్జెక్టులతోపాటు వర్సిటీ అధికారులు అందరికీ కామన్‌గా ఓ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు కాంటెంపరరీ ఇండియా (సీఐఈపీఎస్), సెకండియర్ విద్యార్థులకు ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, ఫైనలియర్ విద్యార్థులకు సైన్స్ అండ్ సివిలైజేషన్ పరీక్షలను కళాశాలలో ఇంటర్నల్‌గా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలతో విద్యతోపాటు సామాజిక దృక్పథం అలవడుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంటోంది. కానీ, కొన్ని కళాశాలలు పరీక్ష నిర్వహించకుండానే మార్కులు వేసి పంపించారు.

దీంతో తాము అసలు పరీక్ష రాయకుండానే ఎలా పాసయ్యామని అవాక్కవుతున్నారు. కామన్ పరీక్షగా నిర్వహించినా... ఈ మార్కులు జాబితాలో రావని, కేవలం ఇంటర్నల్ అని యూనివర్సిటీ ముందుగా ప్రకటిస్తుండడంతోనే విద్యార్థులు పరీక్షలు రాయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు తాము పరీక్షే రాయలేదని విద్యార్థులు చెబుతుండగా... వీరి జవాబు పత్రాలను విధిగా స్వీకరించామని అధికారులు చెబుతుండడం... అనుమానాలకు దారితీస్తోంది. యూనివర్సిటీ అధికారుల పర్యవేక్షణాలోపంతోనే ఇలా జరుగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు