బాబోయ్.. పేలుళ్లు

28 Feb, 2015 00:40 IST|Sakshi
బాబోయ్.. పేలుళ్లు

బాంబు పేలుళ్లు.. గుండెలదిరేలా, చెవులు చిల్లులు పడేలా శబ్దాలు... చిన్నాపెద్ద అంతా ఉలిక్కిపడి లేచేలా అర్ధరాత్రి వేళ బ్లాస్టింగ్‌లు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. పేలుళ్లకు ఇళ్లు, ఒళ్లు గుల్లవ్వడమే కాదు శబ్ద, వాయు కాలుష్యాలతో గ్రామాలకు గ్రామాలే వణికిపోతున్నాయి. అనుమతులు లేకుండా కంకర క్రషర్ల యజమానులు ఈ బ్లాస్టింగ్స్ జరుపుతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

అనుమతులు లేకుండానే క్రషర్లు?
కంకర పేలుళ్లతో జనం బెంబేలు
చంటి పిల్లలకు వినికిడి సమస్యలు
బీటలు వారుతున్న ఇళ్లు
నేతల అండతోనే పేలుళ్ల దందా!
జిన్నారం: మండలంలోని ఖాజీపల్లి, బొల్లారం, రాళ్లకత్వ గ్రామాల పరిధిలో దాదాపు 10 కంకర క్రషర్లు ఉన్నాయి. ఖాజీపల్లి, బొల్లారం గ్రా మాల పరిధిలోని క్రషర్లకు అనుమతులు లేవనే ఆరోపణలున్నాయి. సోలక్‌పల్లి పంచాయతీ పరిధిలోని రాళ్లకత్వ శివారులోని క్రషర్ గ్రామానికి సమీపంలో ఉంది. ఇక్కడ బ్లాస్టింగ్‌లు జరి పితే చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో భూ కంపం సంభవించినట్టుగా భారీ శబ్దాలు వెలువడి, ఇళ్ల పునాదుల్లో కదలికలు వస్తున్నాయి.

గోడలు బీటలు వారుతున్నాయి. ఈ క్రషర్లతో రాళ్లకత్వ, సోలక్‌పల్లి, దాదిగూడ, ఊట్ల తదితర గ్రామాల ప్రజలు కొంత కాలంగా అనేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళ బ్లాస్టింగ్ లు జరుపుతుండడంతో ఇళ్లల్లో నిద్రించే వారం తా ఉలిక్కిపడుతున్నారు. శబ్దాల తీవ్రత అధికం గా ఉండడం వల్ల చిన్నారులకు చెవుడు సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. పెంకుటిళ్లలో పైనుంచి మట్టి, పెంకులు కింద పడుతున్నా యి. భవనాలకు పగుళ్లు రాగా, పెంకుటిళ్లు, పశువుల కొట్టాలు కూలిపోతున్నాయి.

పెంకుటిళ్లు కూలిపోతే ఇదేమని ప్రశ్నించిన వారికి కొంత డబ్బు ముట్టజెప్పడం క్రషర్ యజమానులకు అలవాటైపోయింది. పేలుళ్లు జరిపినప్పు డు భారీగా పొగలు కమ్ముకుంటున్నాయి. ఆ పొగలు గ్రామాలను పూర్తిగా కమ్మేస్తున్నాయి. వాయు కాలుష్యంతో కూడా ఇక్కడి ప్రజలు పలు రోగాలపాలవుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో కంకర క్రషర్ల యజ మానులు నిబంధనలను సైతం పక్కన పెడుతున్నారు. పంచాయతీ అనుమతు లు లేకుండానే భారీ ఎత్తున క్రషర్లను నడిపిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ శాఖలకు సంబంధించిన అనుమతులు కూడా లేవని స్థానికులు చెబుతున్నారు. అక్రమంగా నడుస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు.
 
పొగతో రోగాల పాలు..
పేలుళ్లు జరిపినప్పుడు పొగ గ్రామాన్ని చుట్టేస్తుంది. అరగంట సేపు ఏమి కనిపించదు. ఈ పొగను పీల్చుకోవడం వల్ల రోగాలు వస్తున్నాయి. చిన్నపిల్లలు సైతం రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. మమ్మల్ని ఈ కష్టం నుంచి గట్టెక్కించండి.
- లక్ష్మి, రాళ్లకత్వ
 

గోడలకు బీటలు..
ఇల్లు నిర్మించి ఏడాది కూడా పూర్తికాలేదు. అప్పుడే గోడలకు పగుళ్లు వచ్చాయి. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఒక్క కంకర క్రషర్ కోసం ఇన్ని గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. ఎమ్మెల్యే, ఇతర నాయకులు, అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలి.
 - శ్రీనివాస్,
 
రాళ్లకత్వ దెబ్బతిన్న దర్వాజాలు, చౌకోట్లు..
భారీ శబ్దాలకు ఇంటి దర్వాజాలు, చౌకోట్లు దెబ్బతిన్నాయి. నిరుపేదలమైన మేము మళ్లీ దర్వాజాలను ఏర్పాటు చేసుకోవడం కష్టంగా మారింది. ఇంటిపైకి వెళ్లే మెట్లు కూడా దెబ్బతిన్నాయి. గ్రామంలో బతకటం కష్టంగా మారింది.
 - యాదగిరి, రాళ్లకత్వ

పంచాయతీ అనుమతులు లేవు..
రాళ్లకత్వ గ్రామంలోని కంకర క్రషర్‌కు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. క్రషర్‌ను అక్రమంగా నడుపుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కంకర క్రషర్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- రాములు యాదవ్,సర్పంచ్ సోలక్‌పల్లి

మరిన్ని వార్తలు