దోమలు.. కనిపిస్తే కాల్చివేత..!

27 Nov, 2017 03:45 IST|Sakshi
గోల్కొండ కోటలో ఫాగింగ్‌ దృశ్యం

గోల్కొండ విందు నాటికి ఒక్క దోమా లేకుండా...

 జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం చర్యలు

పరిమళాలు వెదజల్లే సిట్రనెల్లా ఆయిల్, డెల్టా మిథిలీన్‌ లిక్విడ్‌ స్ప్రే

దోమల సాంద్రత తెలుసుకునేందుకు రోజూ డెన్సిటీ స్టడీ

విందురోజు ప్రత్యేక అగర్‌బత్తీల వినియోగం

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్‌)కు హాజరయ్యే అతిథులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విందు ఇవ్వనున్న గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. విందు నాటికి గోల్కొండ కోటలో ఒక్క దోమ కూడా లేకుండా జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం దోమల నిర్మూలన చర్యల్ని ముమ్మరం చేసింది. దోమల నిర్మూలనలో భాగంగా ఇప్పటి వరకూ ఫాగింగ్, స్ప్రేయింగ్‌లకు శక్తిమంతమైన అల్ఫా సైపర్‌ మెథ్రిన్, సిఫనోథ్రిన్‌తోపాటు పొగ రాకుండా పైరిథ్రమ్‌ను వాడుతున్న సిబ్బంది.. తాజాగా పరిమళాలు వెదజల్లే సిట్రనెల్లా ఆయిల్, డెల్టా మిథిలీన్‌ లిక్విడ్‌లను స్ప్రే చేస్తున్నారు. వీటివల్ల దోమల నిర్మూలనే కాకుండా పరిసరాల్లో సువాసనలు వెదజల్లుతాయి. మస్కిటో రెపెల్లెంట్స్‌ గానూ పనిచేస్తుండంతో వీటిని వినియోగిస్తున్నారు. ఈ పనులకుగానూ 4 డ్యూరోటెక్‌ మెషీన్లు, 8 పవర్‌ స్ప్రేయర్లు, 8 మొబైల్‌ మెషీన్లను వాడుతున్నారు.

పరీక్షలతో దోమల లెక్క..
దోమల నిర్మూలనకు చేపట్టిన చర్యలతో పాటు ఏరోజుకారోజు ప్రత్యేకంగా మస్కిటో డెన్సిటీ అధ్యయనం చేస్తున్నారు. ఇందుకు గానూ గోడలపై సక్షన్‌ ట్యూబ్‌లను ఉంచి గాలి గుంజుతారు. దీంతో పరిసరాల్లోని దోమలు ట్యూబ్‌లోకి వస్తాయి. వాటిని టెస్ట్‌ట్యూబ్‌లోకి పంపి లెక్కిస్తారు. బుధవారం విందు సమయానికి ఒక్క దోమా లేకుండా చేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తూ అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం.. చీకటి పడ్డ తర్వాత ఇలా రోజుకు రెండు పర్యాయాలు ఈ పరీక్షలు చేస్తున్నారు. గోల్కొండ కోటలో పరీక్షల్లో ఐదు రోజుల క్రితం గంటకు 200 దోమలు ఉండగా.. శనివారం నాటికి 40కి తగ్గాయి. సోమవారం వరకు వీటిని జీరో చేసే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. సాధారణంగా చీకటి పడిన తర్వాత గోల్కొండ కోటలోకి దోమలు ఎక్కువగా వస్తాయని, అయితే తాము చేపట్టిన చర్యలతో శని, ఆదివారాల్లో దోమలు చాలా వరకు తగ్గిపోయాయని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌ వి.వెంకటేశ్‌ ‘సాక్షి’కి తెలిపారు. గోల్కొండ కోట పరిసరాల్లో దోమల లార్వా వ్యాప్తికి కారణమవుతున్న గుర్రపుడెక్కను తొలగించారు. శాతం చెరువు, హుడా తలాబ్, టిప్పుఖాన్‌ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లోనూ గుర్రపుడెక్క తొలగించినట్లు సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ లచ్చిరెడ్డి తెలిపారు.

విందురోజు ప్రత్యేక అగర్‌బత్తీలు..
ఇప్పటికే పరిమళాలు వెదజల్లే లిక్విడ్స్‌తో స్ప్రేయింగ్‌ పనులు చేస్తుండగా విందురోజు ప్రత్యేక పరిమళాలతోపాటు దోమలను దరి చేరకుండా చేసే లెమన్‌గ్రాస్‌తో తయారు చేసిన ప్రత్యేక అగర్‌బత్తీలను గోల్కొండ కోటలో వినియోగించనున్నారు. లెమన్‌ గ్రాస్‌.. దోమల రెపెల్లెంటే కాక సుగంధం వెదజల్లడంతో సదరు అగర్‌బత్తీలను నాందేడ్‌ నుంచి తెప్పిస్తున్నారు. 

మరిన్ని వార్తలు