మహిళ సజీవదహనం

15 Sep, 2014 02:05 IST|Sakshi
మహిళ సజీవదహనం

మిర్యాలగూడ కైం : ఓ మహిళ సజీవదహనమైంది. సన్నిహితంగా ఉంటున్న యువకుడే ఆమెపై కిరోసిన్ పోసి, నిప్పంటించి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఆదివారం మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకా రం.. అనుముల మండలం అల్వాలకు చెందిన కన్నెబోయిన రాములమ్మ కూతురు సరిత(35) వివాహం దేవరకొండకు చెందిన బ్యాంకు ఉద్యోగి నీలం వెంకటేశ్వర్లుతో 14 ఏళ్ల క్రితం జరిగింది.
 
వీరికి కుమారుడు, కూతురు జన్మించారు. మూడేళ్లుగా సరిత భర్తతో విడిగా ఉంటూ మిర్యాలగూడ మందులవారి కాలనీలో నివసిస్తోంది. కుమారుడు రాహుల్ హైదరాబాద్‌లో ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతుండగా, కుమార్తె శ్రీజ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి అభ్యసిస్తోంది. సరిత తన తల్లిగారి ఊరైన అల్వాలకు చెందిన యువకుడు ఆవులదొడ్డి కరుణాకర్‌తో సన్నిహితంగా మెలుగుతోంది.
 
ఘర్షణ పడి.. ఆపై కిరోసిన్ పోసి..?
అల్వాలకు చెందిన కరుణాకర్ తరచు సరిత ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కరుణాకర్ తీవ్ర ఆవేశానికి లోనైసరితపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు భావిస్తున్నారు. అయితే అదే సమయంలో సరిత కరుణాకర్‌ను పట్టుకోవడంతో అతడికి మంటలు అంటుకున్నాయి. ఏదో విధంగా సరితను విడిపించుకున్న కరుణాకర్ ఇంటి ఆవరణలో ఉన్న నల్లా వద్ద మంటలను చల్లార్చుకుని, ఓ యువకుడి సహాయంతో ఆస్పత్రికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
 
ఇంట్లోనే నిద్రిస్తున్న సరిత కూతురు లేచి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలు, పొగరావడాన్ని గమనించారు. వెంటనే ఇంటి వెనుక భాగం తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా మంటల్లో కాలుతున్న సరిత ఒంటిపై నీళ్లు చల్లారు. తీవ్ర గాయాలైన సరిత అక్కడికక్కడే మృతిచెందింది. మరోగదిలో ఉన్న సరిత కూతురును స్థానికులు క్షేమంగా బయటకు పంపారు. పోలీసులకు సమాచారం అందించగా డీఎస్పీ మోహన్, సీఐ సుదర్శన్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. నల్లగొండ నుంచి క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు.
 
పెళ్లికి ఒప్పుకోరనే..
ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణాకర్‌ను పోలీసులు విచారించారు. కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్న తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, దీనికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరనే బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే అతడి చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని పోలీసులు పేర్కొన్నారు.

ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే సరితకు తీవ్ర గాయాలై చనిపోవడం, కరుణాకర్ స్వల్పంగా గాయపడడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరుణాకర్ ఈ ఘాతుకానికి ఒటిగట్టి పోలీసులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా మెరుగైన చికిత్స కోసం కరుణాకర్‌ను అతడి బంధువులు హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి కన్నెబోయిన రాములమ్మ ఫిర్యాదు మేరకు కరుణాకర్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

>
మరిన్ని వార్తలు