ఉద్యోగ వేటలో ఓడిన మమత

19 Feb, 2019 07:11 IST|Sakshi

పోలీసు దేహదారుఢ్య పరీక్షల్లో అపశ్రుతి 

పరుగుపందెం పూర్తిచేసి.. గుండెపోటుతో యువతి మృతి 

కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు 

మరో ఇద్దరికి స్వల్ప అస్వస్థత 

జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ కమలాసన్‌రెడ్డి సూచన

సాక్షి, కరీంనగర్‌క్రైం/రామగుడు(చొప్పదండి): తనది పేద కుటుంబం. తల్లిదండ్రులకు ముగ్గురు అక్కచెల్లెల్లు. నాన్న ఆటో నడిపి ముగ్గురిని చదివించాడు. పెద్ద కూతురు మమత(20) డిగ్రీ చేసింది. ఇక కుటుంబానికి బాసటగా ఉండాలని నిర్ణయించుకుంది. పోలీసు కొలువుకు దరఖాస్తు చేసుకుంది. ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించింది. ఈవెంట్స్‌కోసం సిద్ధమైంది. కొలువు కొట్టాని కోటి ఆశలతో మైదానంలోకి అడుగుపెట్టింది. పరుగుపందెంలో అర్హత సాధించింది. ఇక పోలీస్‌ అయినట్లే అని సంతోషంతో మైదానం వీడుతున్న సమయంలో ఒక్కసారి కుప్పకూలింది. అక్కడే ఉన్న సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయింది. 


 రోదిస్తున్న మమత కుటుంబసభ్యులు

పోలీసుల వివరాల ప్రకారం.. 
రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన వడ్లకొండ సంపత్‌– సరోచన దంపతులది నిరుపేద కుటుంబం. సంపత్‌ ఆటో నడుపుంటాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు మమత, మానస, అర్చన. పెద్దకూతురు మమత(20) డిగ్రీపూర్తి చేసింది. ఇటీవల పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించింది.మూడు నెలలుగా కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు సంస్థ ఆధ్వర్యంలో గ్రౌండ్‌కోచింగ్‌ తీసుకుంటోంది. పోలీసుశాఖ నిర్వహిస్తున్న దేహదారుఢ్య,శారీరక పరీక్షలకు సోమవారం హాజరైంది. ఉదయం 7గంటలకు 100మీటర్ల పరుగుపందెంను 16.95 సెకన్లలో పూర్తిచేసి అర్హత సాధించింది. ట్రాక్‌ నుంచి బయటకు వస్తూనే కుప్పకూలింది. అక్కడే ఉన్న పోలీసులు, వైద్యసిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయింది. అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందిందని వైద్యులు తెలిపారు. సీపీ కమలాసన్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం అనంతరం స్వగ్రామానికి తరలించారు. ఆస్పత్రి ఆవరణలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీటీసీ వీర్ల కవిత, ఎంపీటీసీ బండపెల్లి యాదగిరి, మాజీ సర్పంచ్‌ వీర్ల రవీందర్‌రావు మృతదేహనికి నివాళి అర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం పరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని రవిశంకర్‌ తెలిపారు. అయితే తరువాత జరిగిన ఈవెంట్స్‌లో జగిత్యాలకు చెందిన రశ్మిత, చిగురుమామిడికి చెంది మనీషలు కూడా స్వల్ప ఆస్వస్థతకు గురయ్యారు. 


మమత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

జాగ్రత్తలు తీసుకోవాలి – సీపీ కమలాసన్‌రెడ్డి 
మమత మృతిచెందడం బాధాకరమని సీపీ తెలిపారు. 25రోజుల పాటు జరగనున్న దేహదారుఢ్య,శారీరక పరీక్షల్లో సుమారు 25వేల మందికి పైగా అభ్యర్థులు పాల్గొంటున్నారని, 4వేల మంది మహిళలు ఉన్నారని తెలిపారు. మూడు రోజులుగా మహిళ కోసం ప్రత్యేకంగా ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నమని పేర్కొన్నారు. ఈ సమయంలో పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో ఉంటారని, 108, పోలీస్‌ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్, వైద్య నిపుణులు ఉంటున్నారని వివరించారు. అభ్యర్థులు ఈవెంట్స్‌కు వచ్చేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  

మరిన్ని వార్తలు