సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

29 Mar, 2016 08:46 IST|Sakshi
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్: ప్రేమించిన యువకుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో మనోవేదనకు గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలనగర్‌లో నివాసముండే రీనా సిల్వియా రిచర్డ్‌సన్(23) ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుంది.

రీనా డిగ్రీ చదువుతున్న రోజుల్లో మేడిపల్లికి చెందిన డెంజిల్‌తో పరిచయం ఏర్పడింది. వీరు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రీనా పని చేసే సంస్థలోనే డెంజిల్‌కు ఉద్యోగం ఇప్పించింది. పలుమార్లు రీనా డెంజిల్‌ను వివాహం చేసుకోమని అడిగింది. అతడు రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి  రీనా మేడిపల్లిలోని డెంజిల్ ఇంటికి వెళ్లి వివాహం చేసుకోవాలని గొడవపడింది. ఈ గొడవలో డెంజిల్ తల్లి, తండ్రి, సోదరిలు రీనాను నిలువరించారు.

దీంతో మనస్తాపం చెందిన రీనా ఇంటికి వచ్చి సోమవారం ఉదయం తన చావుకు డెంజిల్, అతని తండ్రి బిషప్, తల్లి సునీత, సోదరి డయానాలు కారణమని నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రీనా తల్లి మేరిజాన్ గమనించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు