కుమార్తెను చంపి...ఆపై ఉరేసుకుంది

28 Jun, 2016 19:11 IST|Sakshi

ధారూరు (రంగారెడ్డి జిల్లా) : అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ మహిళ.. పది నెలల కుమార్తెను గొంతు నులిమి చంపి ఆపై తానూ దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం రాళ్లచిట్టెంపల్లిలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. రాళ్లచిట్టెంపల్లికి చెందిన రాజుకు కేరెళ్లి గ్రామానికి చెందిన చింతకింది నాగన్న కుమార్తె లక్ష్మి (24)తో 2008లో వివాహమైంది. ఆ సమయంలో తండ్రి నాగన్న రూ. లక్ష నగదు, 3 తులాల బంగారం ఇచ్చి వివాహం చేశాడు. కొంత కాలం వరకు సాఫీగా సాగిన వీరి దాంపత్యంలో ఇటీవల అదనపు కట్నం కింద మరో లక్ష తేవాలని భర్త రాజు, బావ శంకరయ్య, అత్త రుక్కమ్మలు లక్ష్మిని వేధిస్తూ ఇంటి నుంచి గెంటేశారు.

ఆ సమయంలో లక్ష్మి తండ్రి నాగన్నతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరిగి పెద్దల రాజీతో అత్తారింటికి వచ్చిన లక్ష్మికి మళ్లీ వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. దీంతో మానసికంగా కృంగిపోయిన లక్ష్మి.. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తె శ్రీజ (10 నెలలు)ను గొంతు నులిమి చంపి ఆ తర్వాత ఇంట్లోని దూలానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలాన్ని మోమిన్‌పేట్ సీఐ రంగా, ఎస్‌ఐ షంషోద్దీన్‌లు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోసం వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు