పేగుబంధమే పెను శాపమై..

28 Aug, 2017 03:15 IST|Sakshi
పేగుబంధమే పెను శాపమై..
పాపను పెన్‌గంగలో పడేసి, తనూదూకి.. మహిళ ఆత్మహత్య
 
జైనథ్‌(ఆదిలాబాద్‌): ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ధోబీ కాలనీకి చెందిన గొంటి ముక్కుల స్వప్న(45) తన కూతురు అతిథి(4)ని అందరూ చూస్తుండగానే భారీ వంతెన నుంచి పెన్‌గంగలోకి పడేసింది. ఆపై తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన ఆదివారం జైనథ్‌ మండలం డొల్లార గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. జైనథ్‌ మండలం గిమ్మ గ్రామానికి చెందిన స్వప్న, అమరేశ్వర్‌ వివాహం 15 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి ఒక పాప అతిథి జన్మించింది. అమరేశ్వర్‌ మంచిర్యాల డీఎంహెచ్‌వో కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్లుగా స్వప్న మానసిక పరిస్థితి బాగాలేదు.

ఆమెకు హైదరాబాద్, మహారాష్ట్రలోని యావత్‌మాల్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయంకాలేదు. ఆదివారం భర్త, పాపతో కలసి మంచిర్యాలకు బయలుదేరిన స్వప్న ఇంటినుంచి కొంతదూరం వెళ్లగానే భర్తను మధ్యలో వదిలేసి కనిపించకుండా పోయింది. దివ్యాంగుడైన అమరేశ్వర్‌ ఆదిలా బాద్‌లోని పోలీస్‌స్టేషన్‌కు వెంటనే వెళ్లి ఫిర్యాదు చేశాడు. భర్త నుంచి తప్పించుకున్న స్వప్న నేరుగా ఆటో ఎక్కి డొల్లార పెన్‌గంగ బ్రిడ్జి వద్ద దిగింది. ఆటో డ్రైవర్‌ డబ్బులు అడగడంతో.. అతడికి చెవి కమ్మలు తీసి ఇచ్చింది. దీంతో డ్రైవర్, సహ ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుసుకునేలోగానే తల్లి స్వప్న తన పాప అతిథిని బ్రిడ్జి నుంచి పెన్‌గంగలోకి విసిరేసింది.

క్షణాల్లో ఆమె కూడా అందులోనే దూకి ప్రాణాలు విడిచింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు గాలించగా స్వప్న మృతదేహం లభించింది. కాగా, ఎంత గాలించినా పాప ఆచూకీ దొరకలేదు. దీంతో స్వప్న శవాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కి తరలించారు. ఈ మేరకు మృతురాలి మేనమామ దేవ్‌రావ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  తెలిపారు.  
మరిన్ని వార్తలు