-

ఆక్సిజన్‌ అందకే నా భర్త మృతి చెందాడు

17 Jul, 2020 09:26 IST|Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి భార్య  

గాంధీఆస్పత్రి : గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆక్సిజన్‌ అందక తన భర్త మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి భార్య గురువారం చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ముద్దనగిరి గ్రామానికి చెందిన గొల్ల శ్రీధర్‌ (28) స్వరూప దంపతులకు రెండున్నర ఏళ్ల వయసుగల బాబు ఉన్నాడు.  నగరానికి వలస వచ్చి సైనిక్‌పురి సాయినగర్‌లో నివసిస్తున్నారు. శ్రీధర్‌   న్యూటెక్‌ గ్రాఫిక్స్‌ సంస్థలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న శ్రీధర్‌ను ఈనెల 11న ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. నిర్ధారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా రావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు ఈనెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు గాంధీఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు.

15వ తేదీ వేకువజామున 3.25 గంటలకు శ్రీధర్‌ తన భార్య స్వరూపకు ఫోన్‌ చేసి శ్వాస తీసుకోలేక పోతున్నానని, ఆక్సిజన్‌ కూడా పెట్టలేదని చెప్పడంతో  బంధువులతో కలిసి ఆమె గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి వచ్చింది. బెడ్‌ నంబర్‌ 104లో ఉన్న భర్త శ్రీధర్‌ దగ్గరకు వెళ్లి చూడగా ఆక్సిజన్‌ పైప్‌ పెట్టిలేదని, అచేతనంగా పడి ఉన్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. డ్యూటీలో ఉన్న నర్సుకు చెప్పగా ఆమె వచ్చి పల్స్‌ చూడగా జీరో వచ్చిందని దీంతో అక్కడ ఉన్న సిబ్బంది తమను తక్షణమే వార్డు బయటకు పంపించి వేశారని, ఉదయం 10 గంటలకు మీ భర్త మృతి చెందాడని సమాచారం అందించారని, సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలకు మృతదేహాన్ని తరలించారని తెలిపింది. ఆక్సిజన్‌ అందిస్తే తన భర్త బతికేవాడని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన   వైద్యులు, సిబ్బందిపై తగిన చర్యలు చేపట్టాలని కోరుతు ఫిర్యాదుతోపాటు,  తన భర్త ఆక్సిజన్‌ పెట్టలేదని చెప్పిన వాయిస్‌ క్లిప్పింగ్స్‌ను జతచేసింది. నిర్ధారణ పరీక్షల్లో తనకు కరోనా నెగిటివ్‌ వచ్చిందని తెలిపింది.  ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు న్యాయనిపుణులతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు