నాన్నా.. అమ్మ ఏది?

29 Apr, 2020 08:03 IST|Sakshi
మృతురాలి కుటుంబానికి చేయూత అందిస్తున్న కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌

చంపాపేట:  తల్లి ఈ లోకాన్ని విడిచిపోయిందని తెలియని ఆ చిన్నారి.. తన తండ్రి దగ్గరకు వెళ్లి.. నాన్నా.. అమ్మ మాట్లాడట్లేదు.. నాన్నా.. అమ్మను లేపు నాన్నా.. అమ్మ కావాలి.. నాన్నా.. అంటూ గుక్కపెట్టి ఏడుస్తుంటే.. ఆ చిన్నారిని ఓదార్చలేక.. భార్య దహన సంస్కారాలు జరపలేక.. నిస్సాయ స్థితిలో ఉండిపోయి.. ఏం చేయాలో తెలియక బాధను దిగమింగుకుంటూ రోజంతా గడిపేశాడు.. నట్టింట్లో భార్య మృతదేహాన్ని చూస్తూ కనీసం సాయం కూడా అడగలేక పోయాడు. అతడి దుస్థితిని చూసి ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఆర్థిక చేయూత అందించడంతో మృతదేహం ఇంటి నుంచి కదిలింది. వివరాల్లోకెళితే.. చంపాపేట డివిజన్‌ మారుతీనగర్‌ కాలనీకి చెందిన ఇషాంత్, రేఖ దంపతులు. వీరికి ఆరుషీ(5) కూతురు. (అయ్యో ! కరోనా ఎంత పని చేసింది)

ఇషాంత్‌ చార్మినార్‌లోని ఓ మందుల షాప్‌లో గుమస్తాగా విధులు నిర్వర్తిస్తూ చాలీచాలని జీతంతో కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్నాడు. మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇషాంత్‌ కుడి కాలు పూర్తిగా విరగటంతో మంచానికే పరిమితమయ్యాడు. భర్త చికిత్స ఖర్చుల కోసం రేఖ ఎక్కని గడప, మొక్కని దేవుడు లేడు. మూడునెలల పాటు అందిన కాడికి అప్పులు చేసి కుటుంబ భారాన్ని నెట్టుకొస్తూనే తన భర్తకు చికిత్స అందించింది. ఇషాంత్‌ కొద్దిగా కోలుకుని ఒంటి కాలితో అయినా సరే విధులకు వెళ్దామనుకునే సమయంలో కరోనా.. లాక్‌డౌన్‌ వార్త పిడుగులా పడింది. ఇక చేసేది ఏమీలేక ఇషాంత్‌ మళ్లీ ఇంటికే పరిమితమయ్యాడు. తెల్ల రేషన్‌కార్డు లేదు.. దాతల వద్దకు వెళ్లి చేయిచాచేందుకు ఆత్మాభిమానం అడ్డుతో తన కుటుంబ సభ్యులతో అర్దాకలితోనే గడిపాడు.

పెరిగిన అప్పులు.. పూట గడవని పరిస్థితి, భర్త అచేతన పరిస్థితిని తలుచుకుని రేఖ కొన్ని రోజులుగా మానసిక ఆందోళనకు గురయ్యింది. సోమవారం సాయంత్రం ఆమె గుండెపోటుతో మృతి చెందింది. నాన్నా.. అమ్మను లేపు అని కూతురు గుక్కపెట్టి ఏడవటంతో స్థానికులు కంచన్‌బాగ్‌ పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్‌ పి.శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి చేరి తన సొంత ఖర్చులతో రేఖ అంత్యక్రియలు చేయించాడు. స్థానికులు, దాతలు కొంత డబ్బును ఇషాంత్‌కు అందజేశారు. మూడు నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులను అందచేసి చిన్నారి ఆరుషీ ఆలనా పాలన తన బాధ్యత అంటూ భరోసా ఇచ్చిన పోలీసు శ్రీనన్న ఔదార్యానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.. ఇషాంత్‌ కుటుంబ సభ్యులను ఆదకోవాలనుకునేవారు సంప్రదించాల్సిన ఫోన్‌ నెం: 9390225976.

మరిన్ని వార్తలు