న్యాయం కోసం వచ్చి.. భావోద్వేగానికి గురై

15 May, 2015 00:23 IST|Sakshi

సూర్యాపేట మున్సిపాలిటీ
 తన గోడును వెల్లబోసుకునేందుకు డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఓ మహిళ కూప్పకూలిపోయింది.. ఒక్కసారిగా హతాశుడైన డీఎస్పీ, ఇతర సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో చోటు చేసుకున్న ఘటన వివరాలు.. చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ముశిని వెంకటేశ్వర్లుకు మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన తుమ్మ నాగేశ్వరరావు-మట్టమ్మ రెండో కుమార్తె అరుణతో 1991లో వివాహం జరిగింది. వెంకటేశ్వర్లు వృత్తి రీత్యా లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన పదిహేను సంవత్సరాల నుంచి భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో నివాసముంటూ మియాపూర్ శ్రీచైతన్య బ్రాంచ్‌లో లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లోని మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
 
 నిలదీసినందుకు చిత్రహింసలు..
 వెంకటేశ్వర్లు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం అరుణకు తెలిసి నిలదీసింది. అప్పటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ వెంకటేశ్వర్లు భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ వేధించసాగాడు. ఈ విషయంపై పలుమార్లు పెద్దమనుషులు, పోలీస్‌స్టేషన్ల పంచాయితీలు కూడా జరిగాయి. దీంతో కొంతకాలంగా సాఫీగా వారి కాపురం సాగింది. అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ పాపను కూడా భార్య అరుణే సాకుతోంది. తండ్రి వెంకటేశ్వర్లు తల్లిని పెట్టే హింసలను చూడలేక పెద్దకుమారుడు శివ ఐదేళ్ల క్రితమే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. నేటికీ శివ ఆచూకీ తెలియరాలేదు.
 
 తల్లిగారింటికొచ్చి..
 వెంకటేశ్వర్లు వ్యవహార శైలిలో మార్పు లేకపోవడంతో కొద్ది రోజుల క్రితం అరుణ తల్లిగారింటికి వచ్చింది. రెండు రోజుల క్రితం మిర్యాలగూడలో ఉంటున్న తన సోదరికి విషయం వివరించింది. దీంతో ఆమె సలహా మేరకు మిర్యాలగూడ డీఎస్పీని ఆశ్రయించగా సూర్యాపేట డీఎస్పీకి సిఫారసు చేశాడు.
 
 ఫిర్యాదు ఇస్తూ..
 తన సోదరితో కలిసి అరుణ గురువారం మధ్యాహ్నం డీఎస్పీ కార్యాలయానికి వచ్చింది. డీఎస్పీ రషీద్‌ను కలిసి ఫిర్యాదు పత్రం ఇస్తుండగానే అరుణ ఒక్కసారిగా తన కుర్చీలోనే కుప్పకులిపోయింది. వెంటనే ఆమెను స్థానిక ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. తీవ్ర ఉద్వేగానికి లోనై మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు. మృతురాలి సోదరి గంజి విజయ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సంతోష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అరుణ మృతదేహాన్ని సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు