కొట్టి..కొట్టి చంపేశాడు..!

24 Jul, 2015 23:15 IST|Sakshi
కొట్టి..కొట్టి చంపేశాడు..!

వేదమంత్రాల సాక్షిగా తాళికట్టాడు.. ఏడడుగులు నడిచి తోడుగా ఉంటానన్నాడు.. అదనపు కట్నం కోసం చివరకు మూడుముళ్ల బంధాన్నే మరచిపోయాడు.. కలకాలం కాపాడుతానని ప్రమాణం చేసిన అతడే ఆమె పాలిట కాలయముడయ్యాడు.. పుట్టింటి నుంచి కట్నం తేలేదంటూ ఆ ఇల్లాలిని కొట్టి..కొట్టి చంపేశాడు. మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో శుక్రవారం వెలుగుచూసిన ఈ హత్యోదంతానికి సంబంధించి పోలీసులు,     మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు.
 - కొరటికల్(మునుగోడు)
 
 మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన జోలం ఎర్రయ్య, యాదమ్మల కుమారుడు లింగస్వామికి ఆరేళ్ల క్రితం పీఏపల్లి మండల పరిధిలోని అజ్మాపూర్ గ్రామానికి చెందిన సీత బుచ్చయ్య, ముత్యాలమ్మ కుమారై పద్మ(23)తో వివాహం జరిగింది.  వివాహ సమయంలో రూ.4 లక్షల కట్నంతో పాటు 5 తులాల బంగారం, ఇంటి సామగ్రి ముట్టజెప్పారు. మూడేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి కుమారుడు, కూతురు సంతానం.
 
 పురుగులమందు తాగిందని..
 కట్నం కోసం లింగస్వామి బుధవారం కూడా భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై దాడిచేసి తీవ్రంగా కొట్టాడు..మరుసటి రోజు గురువారం కూడా చావబాదడంతో పద్మ అపస్మారకస్థితిలోకి వెళ్లింది. దీంతో భయాందోళనకు గురై జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఆమె బంధువులకు సమాచారం ఇచ్చాడు. పురుగుల మందు తాగిందని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అదే రోజు సాయంత్రం పద్మ మృతిచెందింది.
 
 పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..
 పద్మ పుట్టింటి వారు ఆమె మృతదేహాన్ని చూసి, ఆత్మహత్య చేసుకోలేదని, భర్తే హత్య చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో నల్లగొండ డీఎస్పీ రాములునాయక్, చం డూర్ సీఐ సుబ్బిరామిరెడ్డి, ఎస్‌ఐ డానియల్‌కుమార్‌లు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పద్మ మృతదేహాన్ని పరిశీలించారు. పురుగులమందు తాగిన ఆనవాళ్లు కనిపించకపోవడం, ఒంటిపై గాయాలు ండడంతో భర్త కొట్టడంతోనే మృతిచెంది ఉంటుందని భావిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.  మృతురాలి సొదరుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదనపు కట్నం కోసం వేధించి కొట్టి చంపిన భర్తతో పాటు ఆమె అత్తా, మామ ఎర్రయ్య, యాదమ్మలతో పాటు ఆడపడుచులు సైదమ్మ, ధనమ్మ, వనమ్మలపై కేసు నమోదుచేసి దర్యాఫ్తు జరుపుతున్నట్లు తెలిపారు.
 
 
 కట్నం కోసం..
 వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న లింగస్వామి అదనపు కట్నం తేవాలని భార్యను మూడేళ్లుగా వేధిస్తున్నాడు. అంతటితో ఆగకుండా రోజూ మద్యం తాగి వచ్చి ఇష్టానుసారంగా కొట్టేవాడు. ఈ క్రమంలో పద్మ పుట్టింటికి తెలపడంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. మూడు సార్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో తీరుమార్చుకుంటానని నమ్మబలికాడు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు