బిడ్డకు జన్మనిచ్చి అనంతలోకాలకు..

29 Jun, 2015 08:10 IST|Sakshi

మహిళ మృతిపై ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
 
కొత్తగూడెం అర్బన్: బిడ్డకు జన్మనిచ్చిన మరుసటి రోజే ఓ తల్లి అనంత లోకాలకు చేరింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నారుు. పాల్వంచ మండలం ఎర్రగుంటకు చెందిన దిడ్డి కుమారి(23) కాన్పు కోసం ఈనెల 26న కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది.  అదే రోజు ఏరియా ఆసుపత్రి గైనకాలజిస్టు డాక్టర్ ఝాన్సీ ఆపరేషన్ చేయగా బాబు పుట్టాడు. కాగా మరుసటి రోజు కుమారి పరిస్థితి విషమంగా మారడంతో ఝాన్సీ ఆమెను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి స్వయంగా తీసుకెళ్లింది. ప్రైవేటు ఆసుపత్రిలో కుమారి చికిత్స పొందుతూ మరణించింది.

మృత దేహాన్ని  కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా పంపించారు. విషయం తెలుసుకొని మృతురాలి బంధువులు ఆసుపత్రికి వచ్చి ఆందోళన నిర్వహించారు. కమారి మృతికి వైద్యులే కారణమంటూ ఆరోపించారు. కుమారికి ఆపరేషన్‌కు ముందు ఎక్కువ మోతాదులో మత్తు ఇవ్వడం మూలనే వైద్యం వికటించి మృతి చెందిందని ఆరోపించారు. కుమారి గర్భవతిగా ఉన్న తొమ్మిది నెలల్లో రాని గుండెనొప్పి ఇప్పడేలా వచ్చిందని అధికారులను ప్రశ్నించారు.

అనంతరం ఆసుపత్రి అధికారులు, పోలీసులు కుమారి తరుపున బంధువులు చర్చలు జరిపారు. అంత్యక్రియల ఖర్చు కోసం రూ.30 వేలు ఇవ్వడంతో మృతురాలి బంధువులు ఆందోళన విరమించారు. ఈ ఘటనపై పోలీసు స్టేషన్‌లో ఎటువంటి కేసు నమోదు కాలేదు. ప్రసవం అనంతరం మరుసటి రోజు గుండెనొప్పి, ఆయసం రావడంతో కుమారి ఆమె మృతి చెందినట్లు ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ జనార్దన్ వివరించారు.

మరిన్ని వార్తలు