అమ్మా.. నీకెంత కష్టం! 

17 Jul, 2020 09:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చికిత్స పొందుతూ మహిళ మృతి  

తీసుకెళ్లేందుకు ముందుకు రాని బంధువులు 

మూడురోజులు పోస్టుమార్టం గదిలోనే మృతదేహం 

ఖననం చేసిన మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ సిబ్బంది  

కరోనా లక్షణాలతో ఐసోలేషన్‌లో మృతురాలి కొడుకు  

భూమిమీద పుట్టిన ప్రతి వ్యక్తి ఎప్పుడో ఓసారి ఏదో రకంగా మరణించాల్సిందే. అలా చనిపోయినపుడు పుట్టింటివారో..మెట్టినింటివారో వచ్చి అంత్యక్రియలు చేస్తారు. జిల్లాకేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో పదిరోజులుగా చికిత్సపొందుతూ కోలుకోలేక గురువారం తుదిశ్వాస విడిచింది ఓ మహిళ. ఈమెను ఖననం చేసేందుకు ఎవరూ రాకపోవడంతో పోలీసులు మున్సిపల్‌ సిబ్బందితో ఈ తతంగం కానిచ్చేశారు. ఈ విషాదకర ఘటనకు    సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.   

సాక్షి, మహబూబ్‌నగర్‌: నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన 50ఏళ్ల మహిళ 10రోజుల కిందట శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్ర జ్వరంతో బాధపడుతూ జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆస్తమా ఉన్నట్లు గుర్తించి ఆస్పత్రిలోని వెంటిలెటర్‌లో చికిత్స అందిస్తున్నారు. మూడురోజుల కిందట పరిస్థితి విషమించి మృతి చెందింది. అప్పటివరకు ఆమె వెంట 14ఏళ్ల బాబు ఉన్నాడు. మృతి చెందిన తర్వాత మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న జనరల్‌ ఆస్పత్రి సూపరిటెండెంట్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం విభాగంలో భద్రపరిచాడు. ఈ విషయాన్ని ఆయన నారాయణపేట వైద్యులకు సమాచారం ఇచ్చాడు. వారు మృతురాలు నివాసం ఉంటున్న ఏరియాకు వెళ్లి బంధువులకు విషయం చెప్పారు.

ఆమె నాలుగురోజుల కిందటే మృతి చెందితే మహబూబ్‌నగర్‌లో అంత్యక్రియలు పూర్తి చేసి వచ్చామని సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని అక్కడి వైద్యులు పాలమూరు ఆస్పత్రి సూపరిటెండెంట్‌కు చెప్పారు. మృతదేహం ఇక్కడే ఉందని నారాయణపేట జిల్లా పోలీసులకు విషయం చెప్పారు. మృతురాలికి కరోనా ఉందని మృతదేహాం తీసుకుపోవడానికి మేం రాలేమని సమాధానం తెలిపారు. చేసేది ఏమి లేక మృతురాలి కొడుకును వెంట తీసుకుని మున్సిపాలిటీ సిబ్బందితో మహబూబ్‌నగర్‌లోని ఓ ఏరియాలో ఖననం చేశారు. మృతురాలికి భర్త లేకపోవడంతో 14ఏళ్ల బాబు ఉండటం పరిస్థితి దయనీయంగా మారింది.

మృతి చెందిన తర్వాత కూడా మృతదేహాన్ని చూడటానికి ఒక్కరూ  కూడా రాకపోవడం విశేషం. 14ఏళ్ల ఆ బాబుకు కరోనా లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం జిల్లా జనరల్‌ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. మరో బాధకర విషయం ఏమిటంటే 20రోజుల కిందట నారాయణపేటలో ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి యాజమాని కరోనా లక్షణాలు ఉన్నాయని ఇళ్లు ఖాళీ చేయించాడు. ఆ తర్వాత ఆమె కొడుకుని తీసుకుని వచ్చి జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో చేరింది. చదవండి: మానవత్వం చాటిన ఎస్‌ఐ ధరణిబాబు 

>
మరిన్ని వార్తలు