డీసీసీబీ: అతివకేదీ సహకారం..?

26 Feb, 2020 10:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉమ్మడి జిల్లాలో పీఏసీఎస్‌ చైర్మన్లుగా ఎంపికైంది ఇద్దరే

డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గంలోనూ శూన్యమే

గత పాలకవర్గంలో నలుగురు మహిళా చైర్మన్లు

సాక్షి, అచ్చంపేట: ఆకాశంలో సగం.. అంతటా మేం.. అంటూ అన్నిరంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్నిరకాల ఎన్నికల్లో కాస్తో.. కూస్తో ప్రాధాన్యం లభిస్తోంది. కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో మాత్రం అతివలకు ప్రాతినిథ్యం లేకుండా పోతోంది. సంఘాల్లో డైరెక్టర్ల పదవులు మహిళలకు కేటాయిస్తున్నా.. కీలకమైన సొసైటీలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవులు మాత్రం అందని ద్రాక్షగానే మారాయి. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 87 సంఘాల్లో ఇద్దరు మాత్రమే పీఏసీఎస్‌ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. 

ఇక్కడప్రాధాన్యం కరువు
ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు పంచాయతీలు, ప్రాదేశిక ఎన్నికల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులతోపాటు ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్‌ పదవుల్లో సైతం సగం కేటాయించింది. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో కూడా రొటేషన్‌ పద్ధతిలో మహిళలకు, ఇతర వర్గాలకు అవకాశాలు కలి్పంచింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం మారుతున్న విధానాలకు అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకువచ్చి ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇక్కడ మాత్రం 1964లో ఏర్పాటైన సహకార చట్టం ఆధారంగానే రిజర్వేషన్లు, ఇతర మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. ప్రతి సంఘంలో 13 వార్డులుండగా ఇందులో రెండు మాత్రమే మహిళలకు రిజర్వు చేశారు. అంటే 15 శాతానికి మాత్రమే పరిమితమైంది. 

ఉన్న ఒకస్థానం తొలగించారు 
డీసీసీబీలో ‘ఎ’ కేటగిరి సంఘాల నుంచి 16 మంది, ‘బి’ కేటగిరి సంఘాల నుంచి నలుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. గతంలో మొత్తం 21 మంది పాలకవర్గ సభ్యులు ఉండగా ఈసారి ఒక డైరెక్టర్‌ను తగ్గించారు. గత ఎన్నికల్లో ఎస్సీ (మహిళ)కు ఒక డైరెక్టర్‌ స్థానం రిజర్వు చేయగా.. ఈసారి దాన్ని తొలగించారు.  

సభ్యత్వంలోనూ చిన్నచూపే.. 
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది మహిళలకు పట్టా భూములున్నాయి. ఐకేపీ ఆధ్వర్యంలోనైతే ఏకంగా మహిళలే ధాన్యం కొనుగోలు చేసి తమ సత్తా చాటుతున్నారు. వ్యవసాయంలోనూ కీలకంగా ఉన్న వీరిని కనీసం సభ్యత్వం విషయంలో పట్టించుకోవడం లేదు. సాధారణ ఓటర్ల విషయానికి వస్తే పలుచోట్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండి ఎన్నికల్లో గెలుపోటములు వారి చేతిలోనే ఉంటున్నాయి. ఇక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఆయా సంఘాల్లో కనీసం పదిశాతం కూడా దాటడం లేదు. దీంతో వీరి ప్రభావం కనిపించడం లేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 67,149 మంది పురుఘలు, 24,272 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన సంఘాల చైర్మన్లు ఎన్నుకోలేదు. మేకగూడ పీఏసీఎస్‌ నుంచి కంకటి మంజులారెడ్డి, ధరూర్‌ నుంచి కుర్వ మహదేవమ్మ ఇద్దరు మాత్రమే చైర్మన్లుగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కొంత వరకు నయంగా ఉండేది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో నలుగురు మహిళా చైర్మన్లు ఎన్నికయ్యారు.  

స్థానం కల్పించలే.. 
వార్డు సభ్యులంతా కలిసి సహకార సంఘం చైర్మన్‌ని ఎన్నుకుంటారు. చైర్మన్‌ స్థానాలకు ఎలాంటి రిజర్వేషన్‌ లేకపోవడం.. మహిళలు పోను మిగిలిన 11 మంది దాదాపు పురుషులే ఉండటంతో చైర్మన్‌గా ఆమెకు అవకాశం రావడం లేదు. జిల్లా స్థాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సంస్థ (డీసీఎంఎస్‌)లలో సొసైటీ చైర్మన్లు సభ్యులు కావడంతో ఇందులో ఒక్క మహిళకు అవకాశం దక్కడం లేదు. ఇందులో కూడా డైరెక్టర్లకు రిజర్వేషన్‌ వ్యవస్థ ఉన్నప్పటికీ మహిళలకు స్థానం కల్పించలేదు. సభ్యులో ఒకరు చైర్మన్, వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకోనుండటంతో ఇక్కడ కూడా వీరికి ప్రాధాన్యం ఉండటం లేదు. 

మరిన్ని వార్తలు