పోలీస్‌.. సెల్యూట్‌..

31 Mar, 2020 12:00 IST|Sakshi
దివ్యను ఆస్పత్రికి తరలిస్తున్న ఎస్సై అనూష

కరోనా కట్టడికి అహర్నిశలు కృషి

ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు

విపత్కర పరిస్థితుల్లో కర్తవ్యం వీడని పోలీసులు

కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు

కరీంనగర్‌లో రోడ్‌జోన్‌గా ప్రకటించిన ముకరంపురలో కూరగాయాల మార్కెట్‌ వద్ద భగత్‌నగర్‌కు చెందిన వెంకటేష్‌గుండెపోటుతో కొట్టుమిట్టాడినా కూడా పక్కన ఉన్న ప్రజలెవ్వరూ కరోనా మహమ్మారికి భయపడి దగ్గరకి కూడా వెళ్లలేదు. సమాచారం అందుకున్న పోలీసులు బాధ్యతగా అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా సామాన్య ప్రజలు దరిదాపుల్లోకి వెళ్లడానికి భయపడే పరిస్థితుల్లోనూ పోలీసులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వారికర్తవ్యం నిర్వర్తించారు.  

రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన విద్యార్థి దివ్య(19) సోమవారం తెల్లవారు జామున తీవ్రమైన కడపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన లాక్‌డౌన్‌ వల్ల ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న రామడుగు ఎస్సై గొల్లపల్లి అనూష వెంటనే దివ్య ఉన్న చోటుకు వెళ్లి పెట్రోలింగ్‌ వాహనంలో కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కరీంనగర్‌క్రైం: ఓ వైపు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో పోలీసు యంత్రాంగం రక్షణ వలయంలా ఏర్పడి ప్రజలను సంరక్షించడమే ధ్యేయంగా రేయింబవళ్లు విధులు నిర్వర్తిస్తోంది. ఓ వైపు కర్తవ్య నిర్వహణలో కంటిమీద కునుకు కరువైనా.. ప్రాణాంతక వైరస్‌ అని తెలిసినా వణుకుబెణుకు లేకుండా ప్రజల సేవలోనే ఉంటోంది. ఎప్పుడు తింటారో వారికే తెలియదు.. ఎప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతాయో తెలియని పరిస్థితి అయినా కర్తవ్య నిర్వహణకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధుల్లో నిమగ్నం అవుతున్న పోలీసులకు సమాజం సెల్యూట్‌ చేస్తోంది.

అమోఘమైన సేవలు...
కరోనా వైరస్‌ కట్టడి, లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు విశేష సేవలు అందిస్తున్నారు. 22న దేశ ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ నుంచి నిరంతరాయంగా ఈ నెల 23 తేదీ నుంచి 21 రోజులపా టు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను జిల్లాలోకి అనుమతించడం లేదు. జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి కరో నా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు వచ్చే దారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక దృష్టి సారించా రు. జిల్లా వ్యాప్తంగా 1,137 మంది పోలీ సు అధి కారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

కరీంనగర్‌ నగరంలో 5, జిల్లా సరిహద్దులో 3 పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడివారిని అక్కడే అడ్డుకుంటున్నారు. ఒక్కొక్కరు 8 నుంచి 10 గంటల వరకు విధుల్లో ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నా రు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వర కు కర్ఫ్యూ నేపథ్యంలో పోలీసు బృందాలు తని ఖీలు చేస్తూ అత్యవసర పనులపై వచ్చే వారిని అనుమతిస్తున్నారు. కరీంనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 300 వాహనాలను సీజ్‌ చేశా రు. స్వీయనిర్బంధంలో ఉండని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 237 పాసుపోర్టులు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలకు పోలీసులు ఆహారం, పండ్లు అందిస్తూ వారి కడుపునింపుతున్నారు. సమాజంలోని ఉద్యోగ, వ్యాపార వర్గాలు సైతం ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని విపత్కర పరిస్థితుల్లో పోలీసు విభాగం తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల సేవలోనే నిమగ్నం అవుతున్నారు.

ప్రమాదం ముందే పసిగట్టిన పోలీసులు...
కరోనా రూపంలో జిల్లాకు వచ్చిన పెను ప్రమాదాన్ని సీపీ కమలాసన్‌రెడ్డి సూచనలతో కరీంనగర్‌ స్పెషల్‌ బ్రాంచి పోలీసులు ముందే పసిగట్టారు. ఇండోనేషియా దేశస్తులు జిల్లాలోకి ప్రవేశించి, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్న విషయంపై నిఘా పెట్టడంతో విషయమంతా బయటకు వ చ్చింది. ముందు జాగ్రత్తలు తీసుకొని వారు తిరిగిన ప్రాంతాల్లో రెడ్‌జోన్లుగా ప్రకటించారు. లేదంటే ఇంకా చాలామందికి వచ్చే ప్రమాదాలు ఉండేవని పోలీసులు భావిస్తున్నారు.

కరోనా నియంత్రణే ధ్యేయంగా...
కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. పోలీసు శాఖలో అధికారులు, సిబ్బంది వరకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. కరోనా నియంత్రించేందు కు ఇచ్చిన సూచనలు పాటించి ప్రజలు బయటకు రాకుండా ఉండాలి. అనవసరంగా బయటకు రాకూడదు. బాధ్యతగా ఉంటూ స్వీయనిర్బంధం పాటిస్తే మంచిది. విదేశాల నుంచి వచ్చిన వారు అధికారుల సూ చనలు తప్పని సరిగా పాటించాలి. లేనిపక్షంలో కేసు నమోదు చేస్తాం. జిల్లా సరిహద్దులు, పట్టణాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కరోనా వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.– వీబీ కమలాసన్‌రెడ్డి,కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌

మరిన్ని వార్తలు