ఎడారి దేశంలో కుమిలిన ‘కమల’

2 Aug, 2018 00:44 IST|Sakshi

మస్కట్‌లో 24 గంటల పని.. ఆపై చిత్రహింసలు  

ఎంపీ కవిత చొరవతో స్వదేశానికి..

కమ్మర్‌పల్లి (బాల్కొండ): ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లి అష్టకష్టాల పాలైన ఓ మహిళా ఎంపీ చొరవతో స్వదేశానికి చేరుకుంది. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన కమల, సుదర్శన్‌ దంపతులు. సుదర్శన్‌ తాగుడుకు బానిసవడం.. రోజురోజుకు కుటుంబ పోషణ భారమవడం.. ఈ క్రమంలో రూ.3 లక్షల దాకా అప్పులయ్యాయి. వీటిని తీర్చడానికి సుదర్శన్‌కు ప్రత్యామ్నాయ మార్గం కనిపించకపోవడంతో భార్యను ఉపాధి నిమిత్తం ఒమన్‌ దేశంలోని మస్కట్‌కు పంపించాడు. అక్కడ అరబ్‌షేక్‌ ఇంట్లో భాష సమస్య, 24 గంటల పనితో నరకయాతన అనుభవించింది. చేసిన పనులకు ఏదో వంకలు పెట్టి తీవ్రంగా హింసించేవారు.

ఈ విషయాన్ని ఏజెంట్‌ రాజు, భర్త సుదర్శన్‌కు సమాచారం చేరవేసింది. పైసలు కావాలంటే బాగా కష్టపడాలని ఏజెంట్‌ ఉచిత సలహా ఇవ్వడంతో ఆమె షేక్‌ పెట్టిన కష్టాలను భరించి పని చేసింది. చివరకు వేధింపులకు తాళలేక తాను ఇక్కడ పని చేయనని కుటుంబ సభ్యులకు (భర్తకు కాదు) ఫోన్‌లో తెలిపింది. మస్కట్‌లో పడుతున్న కష్టాలను వివరించింది. ఇక్కడి నుంచి ఎలాగైన రప్పించాలని వేడుకుంది. కమల ఆవేదనను అర్థం చేసుకున్న సమీప బంధువులు స్పందించి అక్కడి, ఇక్కడి ఏజెంట్‌లతో మాట్లాడి రూ.70 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు.

కానీ వారూ నమ్మించి మోసం చేశారు. దీంతో కమల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే.. కమల దీనస్థితిని ఆమె సమీప బంధువు వెంకటేశ్‌ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన కవిత అక్కడి రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి కమలను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కమల స్వదేశం చేరుకుంది. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు భూమయ్య, లక్ష్మితో కలసి చౌట్‌పల్లిలోనే ఉంటోంది.


కవితమ్మకు రుణపడి ఉంటా: కమల
ఉపాధి నిమిత్తం మస్కట్‌ వెళ్లిన తాను అక్కడి కష్టాలను తట్టుకొని మళ్లీ చౌట్‌పల్లి చూస్తాననుకోలేదు. అక్కడ పడిన కష్టం జన్మలో చూడలేదు. 6 గంటలే పని అని చెప్పి రోజంతా పని చేయించుకున్నారు. పని సరిగ్గా చేయకపోతే దెబ్బలు కొట్టారు. తినడానికి సరిగ్గా తిండి, తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు. పని కారణంగా నీరసపడితే విశ్రాంతి తీసుకోనివ్వలేదు. ఆరోగ్యం బాగా లేకున్నా పని చేయించుకున్నారు. ఇక్కడే నా చావు రాసి పెట్టింది ఉం దనుకున్నా. అదృష్టం కొద్దీ ఎంపీ కవితమ్మ కృషితో ఇక్కడికి వచ్చాను. ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటా.

మరిన్ని వార్తలు