కడుపులో శిశువు మాయమైందని.. మహిళ వింత ప్రవర్తన?

4 May, 2020 08:56 IST|Sakshi
 పెద్దపోతులపాడులో మంజుల పరామర్శిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత 

సాక్షి, మానవపాడు (గద్వాల): కడుపులోని శిశువు మాయమైందని మండలంలోని చిన్నపోతులపాడుకు చెందిన ఓ మహిళ ఆదివారం స్థానిక పీహెచ్‌సీ వద్ద కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మంజుల తాను నిండు గర్భిణినని.. ప్రసవం కోసం శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి మానవపాడు పీహెచ్‌సీకి వస్తుండగా దేవుడు కలలోకి వచ్చి ఇంటికి వెళ్లాలని సూచించటంతో తిరిగి వెళ్లాలని చెబుతోంది. ఆదివారం ఉదయం లేచేసరికి ఎలాంటి గర్భం లేదని, దీంతో తిరిగి ఆస్పతికి వచ్చానని తెలిపింది. పరీక్షించిన వైద్యులు నెల క్రితమే అబార్షన్‌ అయినట్లు నిర్ధారించారు.

ఈ విషయమై వైద్యురాలు దివ్య మాట్లాడుతూ.. ఆ మహిళ చెప్పేది అవాస్తవమని అన్నారు. ఆమెకు మతిస్థిమితం తప్పినట్లుందని మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లి వైద్యుల పర్యవేక్షణలో సైకలాజికల్‌ ట్రిట్‌మెంట్‌ ఇప్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అవసరమైతే స్కానింగ్‌ తీయించాలని సూచించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత సెల్‌ఫోన్‌లో వైద్యులతో మాట్లాడి మెరుగైన మంజులకు చికిత్స అందించాలని కోరారు. అనంతరం మంజుల తల్లిగారి ఊరైన పెద్దపోతులపాడుకు వెళ్లి ఆమెను పరామర్శించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ వెంట నాయకులు చిన్న తిరుపతయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, భాస్కర్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు