మూడు కళల్లో రాణిస్తూ..

8 Mar, 2019 08:10 IST|Sakshi

నటన, రచనా రంగాల్లో రాణిస్తున్న జిల్లా కేంద్రానికి చెందిన మహిళ 

పదికిపైగా లఘు చిత్రాలతో లభించిన గుర్తింపు

సేవా కార్యక్రమాల్లోనూ ముందున్న గౌరిశ్రీ 

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): ప్రతీ మనిషికో కళ ఉంటుంది. ఆ కళనే నమ్ముకుని రాణిస్తున్న వారు చాలా మంది ఉంటారు. కానీ ఒకే మనిషికి రెండు, మూడు కళలుండి మూడు రంగాల్లో రాణిస్తున్న వారు మాత్రం కొంతమందే ఉంటారు. పైగా మహిళలు ఉండడం చాలా అరుదు. అయితే నిజామాబాద్‌ జిల్లా కేంద్రం ఆర్యనగర్‌కు చెందిన పారిపల్లి గౌరిశ్రీ అందులో ఒకరని చెప్పవచ్చు. 2014 నుంచి కళా రంగాల్లో రాణిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. లఘు చిత్రాల్లో నటిగానే కాకుండా రచయిత్రిగా పనిచేస్తూ ఉనికిని చాటుతున్నారు. ఇప్పటి వరకు కారుణ్య హత్య, మార్పు, ప్రథమ పౌరుడు, ఏది పవిత్ర యుద్ధం, దటీజ్‌ రావుగారు, మేఘా నాయకుడు, మరణం లేని మనిషి, మరణానికి దారేది, హృదయం, అనాథ శవాల ఆపద్భాందవుడు లాంటి లఘు చిత్రాలకు పనిచేశారు.

వీటిలో కారుణ్య హత్య లఘు చిత్రంలో న్యూస్‌ రీడర్‌గా ఇమిడిపోయి, మార్పు లఘుచిత్రంలో న్యాయవాదిగా జీవించి, హృదయం లఘు చిత్రానికి గాత్రం(వాయిస్‌) అందించి మంచి పేరు సంపాదించారు. కాగా మూడింటికి రచయితగా, ఆరింటికి సహాయ రచయితగా పనిచేశారు. గౌరిశ్రీ నటించిన, రచించిన లఘు చిత్రాలు యూట్యూబ్‌లో ఎంతో మంది నుంచి ప్రశంసలు పొందాయి. బుల్లితెర నటులు సైతం చిత్రాలను వీక్షించి అభినందించారు. అయితే పీజీ పూర్తి చేసిన గౌరిశ్రీ మహిళల చైతన్యం కోసం కూడా పాటుపడుతున్నారు. లఘు చిత్రాల్లో మహిళలకు ఉపయోగపడే, చైతన్యం కలిగించే విధంగా నటనతో పాటు రచనలు చేశారు.

సేవారంగంలో కూడా.. 
గౌరిశ్రీ లఘు చిత్రాలకు నటిగా, రచయిత్రిగానే కాకుండా సమాజానికి సేవకురాలిగా కూడా పరిచయం అయ్యారు. సేవా రంగంలో సైతం తనవంతుగా పాత్ర పోషిస్తూ న్యాయం చేస్తున్నారు. నేనుసైతం స్వచ్ఛంద సంస్థ మహిళా విభాగం ఇన్‌చార్జిగా ఉంటూ బాలోవ్సవ్‌ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహించి నిరుపేద బాలికలకు నోటు పుస్తకాలు, ఇతర సహాయ సహకారాలు అందించడంతో పాటు వారిలో నైపుణ్యాన్ని బయటకు తీస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ఉంటూ... మహిళలను, విద్యార్థినులను చైతన్య పరుస్తున్నారు.

భర్తనే ఆదర్శంగా తీసుకున్నా..
నటన, రచన, సేవా రంగాల్లోకి రావడానికి ప్రధాన కారణం నా భర్త రవిశ్రీనే. ఎందుకంటే తాను సమాజానికి ఉపయోగపడే, సందేశాన్ని ఇచ్చే విధంగా లఘు చిత్రాలు ఎంతో తాపత్రయపడి తీస్తున్నారు. ఇందులో నేను కూడా భాగస్వామిని కావాలనే ఉద్దేశంతో లఘు చిత్రాల్లో నటనతో పాటు చిత్రాలకు రచనలు చేయడం ప్రారంభించాను. అలాగే పేద విద్యార్థినులకు సేవ చేయడం, వారిని చైతన్య చర్చడం నాకు ఎంతగానో సంతృప్తిని ఇస్తోంది. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాతో పాటుగా మంచి సందేశాత్మక లఘు చిత్రాల్లో నటించడమే కాకుండా రచనలు చేయాలని ఉంది. 

– గౌరిశ్రీ, ఆర్యనగర్, నిజామాబాద్‌

>
మరిన్ని వార్తలు