ఈ అతివలు.. కలల రథ సారథులు

8 May, 2015 02:59 IST|Sakshi
ఈ అతివలు.. కలల రథ సారథులు

ఆకాశంలో సగం.. అవకాశాల్లో మాత్రం వెనుకంజే.. అన్న నానుడిని తిరగరాశారీ అమ్మాయిలు. సాంకేతిక కోర్సులు పూర్తిచేసి కంప్యూటర్ కెరీర్ వైపు పరుగులు తీస్తున్న ఈ తరం యువతులకు భిన్నంగా కొత్త పంథాను అనుసరించారు. మొక్కవోని దీక్ష, పట్టుదలతో ముందడుగు వేసి సవాళ్ల రైలు బండికి సారథులుగా నిలిచారు. హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక మెట్రో రైలు ప్రాజెక్టులో కీలకమైన అత్యాధునిక కలల మెట్రో రైళ్లు నడిపే ‘ట్రెయిన్ ఆపరేటర్లు’గా ఏడుగురు అమ్మాయిలు ఎంపికయ్యారు. మెట్రో రైళ్ల నిర్వహణ సంస్థ కియోలిస్ (ఫ్రాన్స్) కంపెనీ నిర్వహించిన ఐదు కఠిన పరీక్షల్లో ఉత్తీర్ణులై.. ఉప్పల్ మెట్రో డిపోలో ఆరు నెలలపాటు ఇచ్చిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.

మెట్రో రైళ్లు డ్రైవర్ అవసరం లేని ‘కమ్యునికేషన్ బేస్డ్ ట్రెయిన్ కంట్రోల్ వ్యవస్థ’ ఆధారంగా పనిచేసినప్పటికీ ఈ రైళ్లను సురక్షితంగా నడిపేందుకు అవసరమైన విభిన్న సాంకేతిక అంశాలపై తర్ఫీదు పొందారు. ఇప్పటి వరకు ఉప్పల్ మెట్రో డిపోలో రైళ్లను నడిపిన ఈ అమ్మాయిలు త్వరలో  మెట్రో పట్టాలపై రైళ్లను పరుగులు పెట్టించనున్నారు. ఈ సందర్భంగా వారిని ‘సాక్షి’ పలకరించింది.   - సాక్షి, హైదరాబాద్
 
ఉద్విగ్నంగా ఉంది
మెట్రో రైలు నడపడం చాలా ఉద్విగ్నంగా ఉంది. కొరియాలో తయారైన ఈ ఆధునిక రైళ్లను మన నగరంలో నడపడం గొప్ప విషయం. ఇందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా.  నేను ఎలక్ట్రానిక్స్ అండ్ క మ్యూనికేషన్స్‌లో డిప్టొమా పూర్తి చేశాను. అయితే అమ్మాయిలంటే కంప్యూటర్ జాబ్‌లకే పరిమితం అంటే నాకు నచ్చదు.
 - కె.మాధురి వరసాయి
 
అవకాశాలిస్తే మహిళలు సత్తా చాటుతారు
 అవకాశాలు లభిస్తే మహిళలు అన్ని రంగాల్లో ముందుంటారన్నదే చిన్నప్పటి నుంచి నేను నమ్మిన ఫిలాసఫి. నేను ట్రిపుల్‌ఈ లో డిప్లొమా పూర్తిచేశాను. ఏడాదిపాటు బీహెచ్‌ఈఎల్ సంస్థలో అసిస్టెంట్‌గా పనిచేశాను. కియోలిస్ సంస్థ నిర్వహించిన ఐదు రకాల పరీక్షలను పాస్ అయి ట్రెయిన్ ఆపరేటర్‌గా ఎంపికయ్యాను.                       - ఎన్.రాధ
 
కంప్యూటర్ జాబ్ అంటే బోరింగ్
నేను ట్రిపుల్‌ఈలో బీఈ పూర్తిచేశాను. రెండున్నరేళ్లపాటు సిమెన్స్ సిస్టమ్స్ సంస్థలో డిజైన్ ఇంజనీర్‌గా పనిచేశాను. ఆఫీసు జాబ్ బోరింగ్ అనిపించింది. అందుకే ఛాలెంజింగ్ కెరీర్‌ను ఎంచుకున్నాను.                    - పి.శ్రీలేఖ
 
గొప్ప ఉద్యోగం అనుకుంటున్నా
నేను ట్రిపుల్‌ఈ లో డిప్లొమా పూర్తిచేశాను. సబ్జెక్ట్‌కు సంబంధించిన కోర్ జాబ్ మాత్రమే చేయాలనుకున్నాను. ఈ సంస్థలో అవకాశం వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తిచేయాలన్నది నా లక్ష్యం.  ఇది గొప్ప ఉద్యోగమని భావిస్తున్నా.            - ఈ.అనూషా దేవి
 
అమ్మా నాన్నల ప్రోత్సాహంతోనే..
మా నాన్న అప్పారావు ప్రైవేటు సెక్యూరిటీ గార్డు. అమ్మ ఆదిలక్ష్మి గృహిణి. చదువంటే నాకు బాగా ఇష్టం. అందుకే మా అమ్మానాన్నలు చాలా కష్టపడి చదివించారు. వారి ప్రోత్సాహంతోనే నేను ఈసీఈలో డిప్లొమా పూర్తిచేశాను. ప్రస్తుతం ఆపరేటర్‌గా ఎంపికయ్యా.
 - జి.శ్యామలాదేవి
 
400 కిలోమీటర్లు  నడిపితే..
మొత్తం 400 కి.మీ. ఎలివేటెడ్ మార్గంలో రైళ్లను విజయవంతంగా నడిపితే కమర్షియల్ ఆపరేటర్‌గా ధ్రువీకరణ పత్రాన్ని కియోలిస్ సంస్థ వారికి అందజేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల చొప్పున వారానికి 48 గంటలపాటు ఆపరేటర్‌గా విధులు నిర్వహించాలి. వీరికి ప్రారంభ వేతనం సుమారు రూ. 25 వేలు. ఏడాదికి 10 నుంచి 15 శాతం చొప్పున వేతనంలో పెరుగుదల ఉంటుంది.
 
భవిష్యత్తులో  మహిళలకు మరింత ప్రాధాన్యం
ట్రెయిన్ ఆపరేటర్లకు మూడు నెలల పాటు తరగతి గదిలో, మరో మూడునెలలు క్షేత్రస్థాయిలో సురక్షితంగా మెట్రో రైళ్లు నడిపేలా శిక్షణనిచ్చాం. ప్రస్తుతం మూడు కారిడార్లలో నడిచే 57 రైళ్లను నడిపేందుకు 57 మంది ఆపరేటర్లను ఎంపికచేసి శిక్షణనిచ్చాం. వీరిలో ఏడుగురు అమ్మాయిలున్నారు. భవిష్యత్ అవసరాన్ని బట్టి వీరి సంఖ్య పెరగవచ్చు. ఎంపికలో మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇస్తాం.
 -  కె.బి.ఆర్.సి.మూర్తి, శిక్షణ  కార్యక్రమం హెడ్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్

మరిన్ని వార్తలు