తొమ్మిదేళ్ల ప్రేమలో కులం పేరు రాలేదు: భావన

6 Nov, 2019 12:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తన భర్తతో పాటు అతడి మిత్రుడు కూడా తనను వేధించినట్లు ట్రైనీ ఐపీఎస్‌ కొక్కంటి వెంకట మహేశ్వర్‌రెడ్డి భార్య బిరుదుల భావన ఆరోపించారు. తొమ్మిదేళ్ల ప్రేమలో ఎన్నడూ తన కులం పేరు ప్రస్తావించని మహేశ్వర్‌ రెడ్డి ఇప్పుడు తక్కువ కులం దానివి అంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని పేర్కొన్నారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేశ్‌ రెడ్డి మోసం చేశాడని భావన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు జరిగిన అన్యాయం గురించి ఆమె మీడియాకు తెలిపారు. ‘కడపకు చెందిన మహేశ్‌ రెడ్డి, నేను 2009 నుంచి ప్రేమించుకున్నాం. 2018 ఫిబ్రవరిలో మాకు వివాహం జరిగింది. ఆ తర్వాత సికింద్రాబాద్‌లో ఒకే చోట ఉన్నాం. పెళ్లి గురించి ఇంట్లో వాళ్లకు మహేశ్‌ను చెప్పమంటే సెటిలయ్యాక చెప్తా అన్నాడు. తీరా ఐపీఎస్‌గా ఎంపిక అయిన తర్వాత.. ఎక్కువ కట్నం సంబంధం వస్తుందనే కారణంతో మొహం చాటేశాడు. మీది తక్కువ కులం కాబట్టి ఇంట్లో ఒప్పుకోరని చెబుతున్నాడు’అని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే విధంగా మహేశ్‌ రెడ్డి స్నేహితుడు నాగేందర్ రెడ్డి కూడా తనను వేధించారని భావన అన్నారు. వారిద్దరూ కలిసి తక్కువ కులం అంటూ తనను మానసిక వేదనకు గురిచేశారని ఆవేదన చెందారు. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తెలంగాణ డీజీపీ, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వద్దకు వెళితే వారు కూడా సరైన రీతిలో స్పదించలేదని ఆరోపించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఐపీఎస్‌ హోదాను ప్రదర్శించారని.. కూషాయిగూడ ఏసీపీ శివకుమార్ తమను నీచంగా చూస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోగా ఇబ్బందులే ఎక్కువగా ఎదురయ్యాయని వాపోయారు.
 

మరిన్ని వార్తలు