గర్భసంచి ఆపరేషన్‌ కోసం వస్తే.. ప్రాణాలు పోయాయి

23 Jan, 2019 10:08 IST|Sakshi
ఆసుపత్రి వద్ద రోధిస్తున్న మృతురాలి  కుటుంబ సభ్యులు లలిత మృతదేహం 

పరిస్థితి విషమించి మహిళ మృతి

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ ఆసుపత్రిలో ఆందోళన 

నిర్మల్‌టౌన్‌: గర్భసంచి ఆపరేషన్‌ కోసం వస్తే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే ఇలా జరిగిందని బంధువులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు, వైద్యుల వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం వాంకిడి అనుబంధ గ్రామం చిన్నరాజురకు చెందిన లలిత(44) గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తం నిర్మల్‌ ప్రసూతి ఆసుపత్రికి తీసుకొచ్చా రు. సోమవారం లలితకు అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మంగళవారం ఆపరేషన్‌ నిర్వహించారు. ఈక్రమంలో ముందుగా మత్తుమందును ఇచ్చారు. ఆపరేషన్‌ ప్రారంభిం చిన కొద్ది సేపటికి పరిస్థితి విషమించి లలిత మృతిచెందింది.

దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే లలిత మృతిచెందిందని ఆమె భర్త రాములు, బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి వద్ద ఆందో ళన చేపట్టారు. డీఎంఅండ్‌హెచ్‌వో జలపతి నాయ క్, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్‌ సురేష్, సీఐ జాన్‌దివాకర్‌ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఆపరేషన్‌ నిర్వహించిన వైద్యురాలు రజిని, అనస్తిసియా నిపుణులు మృతి చెందిన విధానాన్ని వారికి వివరించారు. ఆపరేషన్‌ నిర్వహించిన సమయంలో లలితకు అకస్మాత్తుగా గుండెపోటు, ఫిట్స్‌ రావడంతోనే మరణించిందని తెలిపారు. రోగిని రక్షించేందుకు ప్రయత్నించిన ఫలితం దక్కలేదని వివరించారు. రోగి బంధువులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీఐ జాన్‌దివాకర్‌ వారిని సముదాయించి పంపించారు. 

మరిన్ని వార్తలు