ఉన్నతాధికారిని చెప్పుతో కొట్టిన మహిళా ఉద్యోగి

24 Jul, 2019 15:50 IST|Sakshi

సాక్షి, జనగామ: తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉన్నతాధికారికి ఓ మహిళా అధికారి చెప్పుతో బుద్ధి చెప్పారు. ప్రభుత్వ అధికారి లైంగిక వేధింపులు భరించలేక సహ మహిళా ఉద్యోగి చెప్పు తో కొట్టిన సంఘటన జనగామలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా అల్పసంఖ్యకుల సంక్షేమ శాఖలో (జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్) శ్రీనివాస్‌ అధికారిగా పని చేస్తున్నారు. అదే కార్యాలయంలో ఔట్ సోర్సింగ్‌గా ఓ మహిళ ఉద్యోగి పనిచేస్తున్నారు. అయితే శ్రీనివాస్ ఆ మహిళా ఉద్యోగితో కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తాను చెప్పినట్టు చేస్తే ప్రభుత్వ ఉద్యోగం  ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి నిత్యం లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు.

శ్రీనివాస్‌ తీరుతో విసుగు చెందిన ఆ మహిళా ఉద్యోగి విషయాన్ని స్థానిక నాయకుడి దృష్టికి తీసుకెళ్లింది. అతను ఆఫీసుకెళ్లి నిలదీసి డీసీపీకి చెప్పుతానని బెదిరించే ప్రయత్నం చేశారు. అయినా కూడా అతను తన తీరును మార్చుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ ఉద్యోగి కార్యాలయంలోనే శ్రీనివాస్‌ను చెప్పుతో కొట్టింది. అందరిముందు కొట్టడంతో చేసేది ఏమిలేక ఆమె కాళ్లపై పడి తాను తప్పుచేశానని ఒప్పుకున్నాడు. ఈ ఘటన జరిగి 15 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే విషయం బయటకు రావడంతో అధికారి కీచక పర్వంపై జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు