ఎవుసం అంటే ప్రాణం

15 Feb, 2018 12:35 IST|Sakshi

పంటల సాగుతో మహిళా రైతు ఆర్థిక పరిపుష్టి 

ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు 

ఉత్తమ మహిళా రైతుగా పలువురి సన్మానం  

ఆదర్శంగా నిలుస్తున్న కోట యాకమ్మ 

కాలం కలిసి రాక.. పంట దిగుబడి లేక, మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లభించక.. వ్యవసాయాన్ని వదిలి  ఎంతో మంది రైతులు పట్టణాల వైపు చూస్తున్నారు. అప్పుల పాలై తనువుచాలిస్తున్నవారు కొందరైతే, నగరాలకు వలసపోతున్నవారు మరికొందరు. ఇలాంటి వారికి భిన్నంగా.. భూమిని నమ్ముకుంటే అద్భుతాలు సాధించవచ్చని నిరూపిస్తోంది ఓ మహిళ. వ్యవసాయాన్ని ప్రాణంగా భావించి సాగులో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ అధిక దిగుబడులు సాధిస్తోంది. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా వ్యవసాయంలో అన్ని పనులూ చేస్తూ ఏటా రూ. 3 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది మానుకోట మండలంలోని అమనగల్‌ గ్రామానికి చెందిన కోట యాకమ్మ. సేంద్రియ సాగుతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న స్త్రీమూర్తిపై ప్రత్యేక కథనం.. 

మహబూబాబాద్‌:  పంటను కంటికి రెప్పలా చూసుకుంటూ నిత్యం వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతుంది. జాతీయ ఆహార భద్రత పథకం సభ్యురాలిగా ఉంటూ ఎక్కడ అవగాహన సదస్సులు జరిగినా అక్కడికి వెళ్లి మెళుకువలు నేర్చుకుని ఆచరణలో పెట్టి రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. కోట యాకమ్మ–ఐలయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరి వివాహాలయ్యాయి. కుమారులు వేర్వేరు పనులు చేస్తున్నారు. కాగా యాకమ్మ మాత్రం తనకున్న నాలుగు ఎకరాల్లో అధిక దిగుబడులు సాధించి క్రమంగా సాగును 10 ఎకరాలకు విస్తరింపజేసింది.   

అన్నీ తానై .. 
పొలంలో దుక్కి దున్నడం, కలుపు తీయడం, పురుగుల మందులు చల్లడంతో పాటు ఇతర వ్యవసాయ పనులన్నీ తానే స్వయంగా చూసుకుంటోంది. రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువుల వాడకంపైనే మొగ్గు చూపి  అధిక దిగుబడులు సాధిస్తూ జిల్లాలోనే చెప్పుకోదగిన రైతుగా పేరు సంపాదించింది.  తనకున్న నాలుగు ఎకరాలను 10 ఎకరాలు చేసింది. తనకు తోడుగా భర్త కూడా సాయపడుతున్నాడు. మరోవైపు కార్యాలయాలకు వెళ్లి, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పురుగుల మందులు, ఎరువులను ఉపయోగిస్తూ.. ఆధునిక పద్ధతులను అవలంబిస్తోంది. ప్రతి సంవత్సరం రూ.3 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తోంది. ప్రస్తుతం 10 ఎకరాల్లో మూడు ఎకరాల్లో మామిడి తోట, ఎకరంలో వేరుశనగ, రెండున్నర ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసింది. వ్యవసాయ అధికారులు యాకమ్మను ఉత్తమ రైతుగా గుర్తించి సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు.  

ప్రముఖుల సన్మానం.. 
మల్యాల కేవీకే అధికారులు యాకమ్మను ఉత్తమ మహిళా రైతుగా గుర్తించి రెండుసార్లు సన్మానించారు. పంటలు బాగా పండించినందుకు పలు సంస్థలు, కంపెనీల ప్రతినిధులచే ప్రశంసలు, సత్కారాలు అందుకుంది. వ్యవసాయ కార్యాలయాలు, మరెక్కడైనా సదస్సులు జరిగినా యాకమ్మ అక్కడికి వెళ్లి అధికారుల సూచనలు విని పాటిస్తోంది. కాగా ప్రస్తుతం జాతీయ ఆహార భద్రత పథకంలో సభ్యురాలిగా పనిచేస్తోంది.  

చిన్నతనం నుంచే.. 
చిన్నతనం నుంచే వ్యవసాయ పనులంటే ఇష్టం. ప్రతిరోజూ పొలం వద్దకు వెళ్లకుంటే ఏదో పోగొట్టుకుంటున్నట్లు ఉంటుంది. వారానికి ఒకసారి వ్యవసాయ కార్యాలయాలకు వెళ్లి పంటలకు సంబంధించి నూతన పద్ధతుల గురించి తెలుసుకుని వాటిని పాటిస్తా. ప్రతి సంవత్సరం రూ. 3 లక్షల ఆదాయం వస్తుంది. ఉత్తమ రైతు అవార్డు కోసం చాలాసార్లు ఇక్కడి అధికారులు పేరును పంపారు. నాకు ఇవ్వకపోయినా నాలాగా పనిచేసే రైతులకు ఇచ్చినా బాగుంటుంది. వ్యవసాయ పనుల్లోనే నాకు సంతృప్తి ఉంది.  
– కోట యాకమ్మ, అమనగల్, మనుకోట    

మరిన్ని వార్తలు