మద్యం మత్తులో భార్య: భర్తను హత్యచేశానంటూ

23 May, 2020 18:21 IST|Sakshi

ఓ మహిళ భర్తను చంపిందంటూ హైడ్రామా

ఖమ్మం (కారేపల్లి): భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిందంటూ పుకార్లు షికార్లు చేయటంతో కారేపల్లిలో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. మండలంలోని సూర్యతండా గ్రామానికి చెందిన ఓ మహిళ మద్యం మత్తులో గురువారం రాత్రి కారేపల్లి పోలీసు స్టేషన్‌కు వచ్చింది. తనకు తన భర్తకు మధ్య గొడవ జరిగిందని, తన భర్తను హత్య చేశానని, తనను అరెస్టు చేయాలని పోలీసులను వేడుకుంది. దీంతో స్థానిక పోలీసులు బాధిత మహిళ మానసిక స్థితిని గమనించి ఆ గ్రామ పెద్దమనుషులకు సమాచారం అందించి ఆమెను ఇంటికి పంపించారు. భర్త శుక్రవారం ఉదయం 10 గంటలైన ఇంటికి రాకపోవటంతో గ్రామస్తులు ఆ మహిళను ప్రశ్నిస్తూ ఆటోలో మండలంలోని పలు ప్రాంతాల్లో గాలించారు.

దీంతో కారేపల్లి బస్టాండ్‌ సెంటర్, సినిమాహాల్‌ సెంటర్‌లో ‘భర్తను భార్య చంపేసింది’ అనే వార్త చకర్లు కొట్టడంతో, ఆ మహిళను స్థానికులు చుట్టుముట్టి పలు ప్రశ్నలతో విసిగించారు. జనం వందలాదిగా గుమిగూడటంతో ఆమెను స్థానిక పోలీసులు కారేపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం కారేపల్లి పోలీసులకు ఆ మహిళ భర్త మేకలతండా ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఉన్నాడని స్థానికుల ద్వారా సమాచారం అందుకోవటంతో ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆమె తన భర్తను చంపలేదని, అన్ని పుకార్లేనని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య కేవలం చిన్న గొడవ జరగడంతో ఆ వ్యక్తి అలిగి బయట ఉన్నట్లు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా