మహిళలకు ‘పెద్ద’పీట

7 Mar, 2019 10:52 IST|Sakshi

ఖరారైన జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు 

నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం జెడ్పీలు ‘ఆమె’కే

ఖరారు చేసిన పంచాయతీరాజ్‌ శాఖ 

ఆదిలాబాద్‌అర్బన్‌: భూమి.. ఆకాశం.. అన్నింటా సత్తాచాటుతున్న మహిళలకు రాజకీయాల్లోనూ ప్రాతినిథ్యం దక్కుతోంది. ఒకప్పుడు వంటింటికి పరిమితమైన వీరికి అవకాశాలు అందివస్తున్నాయి. మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠాలను ఎక్కువ సంఖ్యలో ‘ఆమె’కు కేటాయిస్తూ పంచాయతీ రాజ్‌ శాఖ నిర్ణయం తీసుకుంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మూడు జెడ్పీ పీఠాలు ఆమెకు దక్కాయి. ప్రస్తుతమున్న ఆదిలాబాద్‌ జెడ్పీ తప్పా కొత్తగా ఏర్పాటైన నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లా పరిషత్‌లు ఆమెను వరించాయి. ఇక ఆయా జిల్లాల పరిషత్‌ చైర్మన్‌ స్థానానికి రిజర్వేషన్‌పై స్పష్టత రావడంతో ఆయా పార్టీల్లో మహిళా నేతలెవరున్నారనే   అంశంపై పార్టీలు దృష్టి సారించనున్నాయి. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీలుగా గెలవడం ఒక ఎత్తైతే.. విజయం సాధించిన జెడ్పీటీసీల మద్దతు కూడ గట్టి చైర్మన్‌ పదవీ దక్కించుకోవడం మరో ఎత్తు.

 ఆ మూడు జిల్లాలు ‘ఆమె’కే..

జిల్లా ప్రజా పరిషత్‌కు అధ్యక్షులుగా వ్యవహరించే చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఆయా జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌ రిజర్వేషన్ల లెక్క తేలింది. గత వారం రోజులుగా పంచాయతీరాజ్‌ శాఖలో జరుగుతున్న కసరత్తుకు తుది రూపు వచ్చింది. ఎట్టకేలకు ఆయా జిల్లాల వారీగా జెడ్పీ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే ఆదిలాబాద్‌ జిల్లా పునర్విభజనలో భాగంగా నాలుగు జిల్లాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. కొత్తగా మరో మూడు జిల్లాలు నిర్మల్, మంచిర్యాల, కుమురంభీంలు ఏర్పాటయ్యాయి. పాత ఆదిలాబాద్‌ జిల్లాకు జనరల్‌ రిజర్వేషన్‌ కేటాయించగా, కొత్తగా ఏర్పడిన మూడు జిల్లాలకు మహిళా రిజర్వేషన్లను కేటాయించారు. జిల్లా పునర్విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి సారిగా జెడ్పీ చైర్‌పర్సన్లుగా మహిళలే ఎన్నిక కానున్నారు. 

ఎస్టీలకు రెండు..ఎస్సీ, ఆన్‌రిజర్వుడ్‌ ఒక్కోటి.. 

జిల్లా ప్రజా పరిషత్‌లో భాగమైన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల లెక్క తేలకుండానే చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆదిలాబాద్‌ జెడ్పీని ఎస్టీ జనరల్‌కు కేటాయించగా, నిర్మల్‌ జెడ్పీని ఆన్‌ రిజర్వుడ్‌ మహిళ, మంచిర్యాల జెడ్పీని ఎస్సీ మహిళ, ఆసిఫాబాద్‌ జెడ్పీని ఎస్టీ మహిళకు కేటాయించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో నాలుగు జెడ్పీలు ఉన్నాయి. రాష్ట్రం యూనిట్‌గా తీసుకొని ఆయా జిల్లాలకు జెడ్పీ పదవుల రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఇందులో మహిళలకు 50 శాతం కోటా ఉంటుంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మూడు కొత్త జిల్లాలకు మహిళలకు రిజర్వేషన్లు దక్కాయి. అయితే ఈ సారి ఎస్సీ, ఎస్టీ, ఆన్‌రిజర్వుడ్‌ స్థానాలకు తప్ప బీసీ వర్గానికి ఏ ఒక్క స్థానం దక్కలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్‌లో మార్పు జరిగిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

రిజర్వేషన్లు ఇలా..

జిల్లా  వర్గం       కేటాయింపు 
ఆదిలాబాద్‌  ఎస్టీ    జనరల్‌ 
కుమురంభీం ఎస్టీ  మహిళ 
మంచిర్యాల ఎస్సీ  మహిళ 
నిర్మల్‌    అన్‌రిజర్వుడ్‌ మహిళ 

మరిన్ని వార్తలు