అసెంబ్లీ బరిలో ఆమె

11 Nov, 2018 14:51 IST|Sakshi

ఈ సారి జిల్లా నుంచి అధిక సంఖ్యలో మహిళలు పోటీ

నిర్మల్‌లో మొదటిసారి, ముథోల్‌లో రెండోసారి, ఖానాపూర్‌లో నాలుగోసారి.. 

జనాభాతోపాటు ఓటర్లలోనూ స్త్రీలదే ఆధిపత్యం 

నిర్మల్‌: రాష్ట్రంలో జనాభాపరంగా అధిక స్త్రీ, పురుష నిష్పత్తి కలిగిన జిల్లాగా నిర్మల్‌కు పేరుంది. ప్రతీ వేయిమంది పురుషులకు 1046మంది మహిళలున్నారు ఇక్కడ. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 7,09,418 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 3,46,721మంది ఉండగా, స్త్రీల సంఖ్య 3,62,697. ఈ లెక్కన పురుషులతో పోల్చితే 15,976 స్త్రీలు అధికంగా ఉన్నారు. ఇలా స్త్రీ శక్తి ఎక్కువగా ఉన్న జిల్లాలో రాజకీయంగా మాత్రం మహిళలు వెనుకంజలోనే ఉన్నారు. 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఖానాపూర్‌ మినహాయిస్తే ముథోల్‌ నియోజకవర్గంలో ఒక్కసారి పోటీ చేయగా, నిర్మల్‌లో మాత్రం ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా పోటీ చేయలేదు. ఖానాపూర్‌లో ప్రస్తుతం నాలుగోసారి మహిళ అభ్యర్థి పోటీ పడుతుండగా, నిర్మల్‌లో మాత్రం తొలిసారిగా మహిళలు బరిలో నిలిచారు. 

ఓట్లలోనూ అధిక్యమే... 
జిల్లాలో జనాభా పరంగా అధికంగా ఉన్న మహిళలు ఓటరు జాబితాలోనూ సత్తాచాటారు. జిల్లా లో మొత్తం 6,09,362మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 2,95,855 మంది మాత్రమే. మహిళ ఓటర్లు ఏకంగా 3,13,436మంది ఉన్నా రు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే అత్యధికం గా నిర్మల్‌ నియోజకవర్గంలో 1,10,900మంది ఉన్నారు. ముథోల్‌లో 1,08,982 ఉండగా అత్యల్పంగా ఖానాపూర్‌లో 93,554మంది మహిళ ఓట ర్లు ఉన్నారు. మూడు నియోజకవర్గాల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళఓటర్లే అధికంగా ఉన్నారు. 

తారుమారు చేయగల శక్తి... 
మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపుఓటములను ఖరారు చేసే శక్తి మహిళల చేతిలోనే ఉంది. ఏ పార్టీ గెలువాలన్న, ఏ అభ్యర్థి నిలువాల న్న మహిళల మద్దతు తప్పనిసరి. ఎన్నికల్లో అభ్యర్థుల జాతకాలను తారుమారు చేయగల శక్తి మí ßæళలకు ఉంది. 2011 లెక్కల ప్రకారం జిల్లాలో 1,51,977మంది అక్షరాస్యులున్నారు. జనాభా పరంగా అధికంగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో మాత్రం 47.14శాతంతో వెనుకంజలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే మహిళ సంఖ్య అధికంగా ఉంది. ఇందులో బీడీ కార్మికులు వ్యవసాయ కార్మికులు, ఉపాధి పనులు చేసేవారు, స్వయం ఉపాధి పొందే మహిళలే ఎక్కువ ఉన్నారు. నేతల తలరాతను ఈ వర్గాలే మారుస్తున్నాయి. ఈ క్రమం లోనే నాయకులు మహిళ సంఘాలపైన ఆధారపడుతున్నారు.  

తొలిసారి బరిలోకి... 
నిర్మల్, ముథోల్, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో తొలిసారిగా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో మహిళలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 1952లో నిర్మల్‌ ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 66ఏళ్లలో 15 ఎన్నికలు జరిగాయి. ఇన్నేళ్లలో ఒకసారి కూడా ఇక్కడ మహిళలు పోటీలో నిలువలేదు. ఈ సారి మాత్రం నిర్మల్‌లో మహిళ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి ప్రముఖ వైద్యురాలు, ది వంగత డిప్యూటీ స్పీకర్‌ అయిండ్ల భీంరెడ్డి కుమారై సువర్ణారెడ్డి అభ్యర్థిగా నిలిచారు. బహుజన లెఫ్ట్‌ఫంట్‌(బీఎల్‌ఎఫ్‌) అభ్యర్థిగా అలివేలు మంగ బరిలో ఉన్నారు. ఇక ముథోల్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు డా క్టర్‌ పడకంటి రమాదేవి రెండోసారి పోటీ పడుతున్నారు. గత 2014 ఎన్నికల్లో ఆమె రెండోస్థానంలో నిలిచారు. ఈ సారి గెలుపుకోసం శ్రమిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా సురేఖరాథోడ్‌ తొలిసారిగా పోటీలో నిలిచారు. 

ఖానాపూర్‌లో నాలుగోసారి... 
ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎస్టీ నియోజకవర్గమైన ఖానాపూర్‌లో మహిళల ప్రాతినిధ్యం చెప్పుకోతగ్గట్లుగా ఉంది. ఈ ఎన్నికలను కలుపుకోని నాలుగోసారి మహిళ అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. 2008లో అప్పటి ఖానాపూర్‌ ఎమ్మెల్యే గోవింద్‌నాయక్‌ తెలంగాణ ఉద్యమంలో భాగం గా తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వచ్చిన ఉప ఎన్నికల్లో మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌ సతీమణి రాథోడ్‌ సుమన్‌బాయి టీడీపీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మేస్రం నాగోరావుపై గెలుపొంది, నియోజకవ ర్గం నుంచి తొలి మహిళ ఎమ్మెల్యేగా చరిత్రకెక్కా రు. అనంతరం 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థి హరినాయక్‌పై గెలుపొందారు. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి అజ్మీరా రేఖానాయక్‌ బరిలో నిలిచారు. టీడీపీ నుంచి రితీష్‌ రాథోడ్‌ పోటీ చేశారు. ఇందులో రేఖానాయక్‌ 38,511 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఖానాపూర్‌ నుంచి తమ అభ్యర్థిగా రేఖానాయకే అవకాశం ఇచ్చారు. అలాగే ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్న ఆశావాహుల్లోనూ మహిళలు ఉన్నారు.  

మహిళల ఓట్లను నమ్ముకుని...
జిల్లాలో తొలిసారిగా అధిక సంఖ్యలో మహిళ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరంతా దాదాపు తమ మహిళల ఓట్లను నమ్ముకునే ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఒక్కసారి మహిళలకు అవకాశం ఇవ్వాలంటూ ప్రచారంలో అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపిస్తే మహిళల సమస్యలపైన పోరాడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మహిళలు, యువకులు, విద్యావంతులు సహకరిస్తే తమ గెలుపు సాధ్యమేనన్న ధీమాతో మహిళ అభ్యర్థులు ఉన్నారు. ఈనేపథ్యంలో జనాభాలో, ఓటరు జాబితాలో అధిపత్యం చాటుతున్న మహిళల తీర్పు ఎలా ఉంటుందోనని పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి.   

మరిన్ని వార్తలు