‘ఆస్పత్రుల చుట్టూ తిప్పి అమ్మను చంపేశారు’

15 Apr, 2020 12:04 IST|Sakshi

మృతురాలి కుమారుడి ఆరోపణ

హిమాయత్‌నగర్‌: ‘కరోనా’ పేరుతో వైద్యం అందించేందుకు నిరాకరించిన డాక్టర్లు తన తల్లి మృతికి కారణమయ్యారని మృతురాలి కుమారుడు ఆరోపించాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం, ముత్తిరావుపల్లె గ్రామానికి చెందిన రైతు గద్దె చిన్నాన్న కుమార్తె లక్ష్మి (46)కి ఐదేళ్ల క్రితం గర్భసంచి తీసేశారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు అనారోగ్యానికి గురవుతోంది. ఈనెల 11న ఆమెకు జ్వరం రావడంతో 13న ఆమె కుమారుడు గద్దె పున్నం మంచిర్యాలలోని ఓ ల్యాబ్‌లో పరీక్షలు చేయించాడు. ఊపిరితిత్తుల్లో ‘నంజు’ ఏర్పడినట్లు చెప్పడంతో ఓప్రైవేటు హాస్పిటల్‌కు తీసికెళ్లాడు. అక్కడ మరోసారి పరీక్షించిన వైద్యులు కరోనాగా అనుమానిస్తూ ప్రభుత్వ ఆస్పత్రికి తీసికెళ్లాలని సూచించారు.

దీంతో అతను 13న రాత్రి తన తల్లిని మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నోడల్‌ ఆఫీసర్‌ ‘మీ అమ్మకు కరోనా సోకినట్టు అనుమానంగా ఉంది. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలం’టూ ఓ పేపర్‌పై సంతకం తీసుకుని అంబులెన్స్‌లో తరలించారు. మంగళవారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమెకు దగ్గు, జ్వరం, జలుబు, శ్వాసకోశ ఇబ్బంది లేనపుడు ఇక్కడికెందుకు తీసుకొచ్చావని వైద్యులు ఆరా తీస్తుండగానే, 7.35 సమయంలో లక్ష్మి పెద్ద వాంతులు చేసుకుని, ప్రాణాలు విడిచింది. దీంతో కింగ్‌కోఠి ఆస్పత్రి వర్గాలు ‘కరోనా’ మృతదేహాలను తరలించే వారితో పాటు పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలిపారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ‘కరోనా’ బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుని సాయంత్రం 4.10 సమయంలో లక్ష్మి మృతదేహాన్ని మంచిర్యాలకు తరలించింది. కానీ లక్ష్మికి కరోనా లక్షణాలున్నాయో లేవో నిర్ధారించలేదు. కానీ, కరోనా మృతుల విషయంలో తీసుకునే జాగ్రత్తలతో ఆమె మృతదేహాన్ని తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు...
‘సార్‌.. మా అమ్మకి కరోనా లక్షణాలుంటే ఇక్కడే క్వారంటైన్‌లో పెట్టండి. హైదరాబాద్‌ తీసుకెళ్లే వరకు ఏదైనా అయితే పెద్దదిక్కును కోల్పోతాం’ అని మంచిర్యాల నోడల్‌ ఆఫీసర్‌ను వేడుకున్నట్టు లక్ష్మి కుమారుడు పున్నం చెప్పాడు. అయితే, గాంధీలోనే చికిత్స అందిస్తారని, వెంటనే మీ అమ్మని తీసుకెళ్లాలని బలవంతంగా సంతకం పెట్టించుకుని పంపేశారని వాపోయాడు. అక్కడే పరీక్షించి చికిత్స అందిస్తే నా తల్లి కళ్లెదుట ఉండేదని, అన్యాయంగా చంపేశారని విలపించాడు.

మరిన్ని వార్తలు