నువ్వేం రాణిస్తావన్నారు..?

8 Mar, 2018 11:42 IST|Sakshi
పద్మాదేవేందర్‌ రెడ్డి

రాజకీయాల్లో నాదైన ముద్ర వేశా..

ఆడపిల్లనని అమ్మానాన్న తక్కువ చేయలేదు

33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలి

ఆర్థిక స్వావలంబనతోనే సాధికారత

వివక్ష, అసమానతలను తిప్పికొట్టాలి

డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి

తెలంగాణ రాజకీయ చిత్రపటంలో ఆమెది ప్రత్యేక స్థానం. తెలంగాణ సాధనలో పురుషులతో సమానంగా ఉద్యమించిన సాహసి. రాజకీయ నేపథ్యం లేకున్నా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తున్న నాయకురాలు ఆమె. అసెంబ్లీని సజావుగా నడుపుతూ అందరి మన్ననలు పొందుతున్న ఉపసభాపతి.. ఆమె.. మెదక్‌ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డి. మహిళగా ఆమె రాజకీయ ప్రస్థానం భావితరాల మహిళలకు స్ఫూర్తిదాయకం. మహిళా దినోత్సవం సందర్భంగా తాను ఎదుర్కొన్న కష్టాలు, రాజకీయరంగ ప్రవేశం తదితర అంశాలను తెలియజేస్తూనే మహిళా సాధికారత సాధన, స్త్రీ పురుష అసమానతలు, గృహహింస, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ తదితర అంశాలపై సాక్షి తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆమె పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే.. 

సాక్షి, మెదక్‌ : మహిళామణులందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా సాధికారత గురించి ప్రజాప్రతినిధులు ఉసన్యాసాలు ఇవ్వడం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అయినా మహిళ సంక్షేమం, అభివృద్ధి, సాధికారతకు సంబంధించి ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇతర దేశాలతో పోలిస్తే  మన దేశంలో మహిళలు చాలా వెనకబడి ఉన్నారు. మహిళా హక్కుల సాధనలో అమెరికా, యూరప్‌లాంటి దేశాలు ముందంజలో ఉన్నాయి. మహిళా హక్కుల సాధనలో ఆదేశాల సరసన మనమూ నిలబడాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.

ఆడ పిల్లలు, మగ పిల్లల మధ్య తల్లిదండ్రులు అసమానతలను చూపించటం నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఇది మారాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలి. వారి మనోభావాలను గౌరవించాలి. మగ పిల్లలతో సమానంగా ఎదిగేందుకు అవసరమైన వాతావరణం, అవకాశాలు కల్పించాలి. ఆడపిల్లలు ఎదగటంలో తల్లిదండ్రులతే కీలకపాత్ర. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రగులు గుర్తెరగాలని నా మనవి. అసమానతలు, వివక్షకు గురయ్యే మహిళలు దైర్యంగా ఎదుర్కొని తిప్పకొట్టాల్సిన అవసరం ఉంది. 


మహిళలు రాజకీయాల్లో రావాలి..
ఆకాశంలో సగ భాగమైన మహిళ ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తోంది. అలాగే రాజకీయరంగంలోనూ రాణించాల్సిన అవసరం ఉంది. రాజకీయ రంగం అంటరానిదేమి కాదు. చదువుకున్న యువతులు,  సామాజిక స్ప్రహా ఉన్న మహిళలు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మహిళలు తమంతట తాము రాజకీయాల్లోకి వచ్చే సానుకూల పరిస్థితులు దేశంలో లేవు. ఈ పరిస్థితి మారాలంటే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి.

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ అమలు చేయడం వల్ల మహిళలు రాజకీయాల్లోకి రావడం ఆరంభమైంది. ప్రస్తుతం తెలంగాణలోని మహిళా శాసనసభ్యులు తమ నియోజకవర్గ అభివృద్ధికి పాలుపడుతూనే మహిళా సమస్యలపైనా స్పందిస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మహిళా శాసనసభ్యులు తమవంతు పాత్ర పోషించటం ముదావాహం. 

ధైర్యం ముందుకు సాగాను
మహిళవు నువ్వు రాజకీయాల్లో ఏం రాణిస్తావని మొదట కొంత మంది నన్ను నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. అయితే నా భర్త దేవేందర్‌రెడ్డి, మా అమ్మ నన్ను రాజకీయాల్లో ప్రవేశించేలా ప్రోత్సహించారు. రామాయంపేట జెడ్పీటీసీగా రాజకీయాల్లోకి ప్రవేశించిన నేను ఎన్నో ఒడిదుడుకులు చవిచూశాను. అయినా ఎక్కడా వెరవలేదు. ధైర్యం ముందుకు సాగాను. ఉద్యమంలో రోడ్లపైకి వచ్చి పోరాటం చేశాను. నా పోరాటస్ఫూర్తి నచ్చి ప్రజలను మూడు పర్యాయాలు నన్ను శాసనసభకు పంపారు. 

ప్రత్యేక మహిళా పోలీస్టేషన్‌లతో..
మహిళలను గౌరవించాలన్న ఆలోచనను కన్నతల్లి మగపిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి.  ‘షీ టీమ్స్‌’ ఏర్పాటుతో మహిళలపై వేధింపులు, దాడులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం మహిళ రక్షణ కోసం ప్రత్యేకంగా మహిళా పోలీస్టేషన్‌లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయటం సంతోషదాయకం. ప్రతీ ఆడపల్లిను తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడం మానుకోవాలి. మహిళలు ఆత్మన్యూనతను వీడి  పురుషులతో సమానంగా పోటీ పడాలి.  విద్య, ఆర్థిక స్వావలంభనతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ప్రతి ఆడపల్లి ఉన్నత చదువులు చదవాలి.  ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నించాలి.  తల్లిదండ్రులు ఆడపిల్లల్లో ధైర్యం నూరిపోయాలి. 
 

తెలంగాణ సాధనలోనూ కీలకపాత్ర


 తెలంగాణ ఉద్యమ సమయంలో పద్మా దేవేందర్‌ రెడ్డి(ఫైల్‌ ఫోటో)

తెలంగాణ సాధనలోనూ మహిళలు కీలకపాత్ర పోషించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మహిళా ఉద్యోగినులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మానసంపదను కాపాడుకోవాలన్న తలంపుతో ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. బాలింత, బిడ్డ సంక్షేమం కోసం రూ.13వేలు అందజేస్తోంది.

ఆడపిల్ల పెళ్లిళ్ల కోసం షాదీముబారక్, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ పథకాలను అమలు చేస్తోంది. ఆడపిల్లల చదువులకోసం కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలు నడపుతోంది. సీఎం కేసీఆర్‌ తెలంగాణలోని ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని, నీటి కష్టాలను తీర్చేందుకు మిషన్‌భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు.  ఉపసభాపతిగా అసెంబ్లీలో నిష్ఫక్షపాతంగా వ్యవహరిస్తాను. మహిళా సభ్యులు మహిళా సమస్యలపై మాట్లాడేందుకు ముందుకువస్తే వారికి ప్రాధాన్యత ఇస్తాను.

మరిన్ని వార్తలు