షీ వాంట్‌..

17 Nov, 2018 10:06 IST|Sakshi

ఆమె’కు ఎన్నో ఆకాంక్షలు

పార్టీ మేనిఫెస్టోల్లో చేర్చాలని వివిధ మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల డిమాండ్‌

దశాబ్దాలు గడిచినా హక్కులు, అవకాశాల్లో ‘ఆమె’కు సమానభాగస్వామ్యం దక్కడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి.. ప్రతి ఎన్నికల్లో పార్టీలు హామీల వర్షంకురిపిస్తున్నాయి. కానీ మహిళల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సామాజిక భద్రత ఇప్పటికీఅంతంతమాత్రంగానే ఉంది. ఇల్లు, బడి, కార్యాలయం, రోడ్డు, బహిరంగప్రదేశాల్లో ఎక్కడో ఓ చోట ఏదో రకమైన వివక్ష, వేధింపులు,అణచివేతను మహిళలు ఎదుర్కొంటున్నారు. గృహహింస, నిర్భయ చట్టాలు వచ్చినా.. షీటీమ్స్‌ బృందాలు రంగంలోకి దిగినా లైంగిక దాడులు, హింస కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో మహిళల ఆకాంక్షలు ఏ మేరకు ప్రతిబింబిస్తున్నాయనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మహిళా, హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ‘ఉమెన్‌ మేనిఫెస్టో’పై దృష్టిసారించాయి. మహిళల సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలు ‘ఉమెన్‌ మేనిఫెస్టో’నుప్రామాణికంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాయి.  

సాక్షి, సిటీబ్యూరో : ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు, కళాశాలలు తదితర విద్యాసంస్థల్లో అమ్మాయిలు నిశ్చింతగా చదువుకునేందుకు  అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అన్ని విద్యాసంస్థల్లో ఇందుకోసం ప్రత్యేకంగా 2013 నిర్భయ చట్టానికి అనుగుణంగా ‘నిర్భయ సెల్‌’ను ఏర్పాటు చేయాలి. టాయిలెట్‌ల ఏర్పాటు, మంచినీళ్లు, పౌష్టికాహారం అందజేయాలి. అమ్మాయిల్లో రక్తహీనత ఒక సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్కూళ్లలో  తృణధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని అందజేయాలి. స్కూళ్లలో తప్పనిసరిగా చైల్డ్‌ హెల్త్‌ కేర్‌ రికార్డులను అమలు చేయాలి. ఇందులో ఉపాధ్యాయులు, ఆరోగ్యకార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు భాగస్వాములు కావాలి. యుక్తవయసు బాలికలకు చక్కటి ఆరోగ్య విద్యను అందజేయాలి. శానిటరీ ప్యాడ్స్, న్యాప్‌కిన్స్‌ అందుబాటులో ఉంచాలి. యుక్తవయసులో వచ్చే మార్పుల గురించి అమ్మాయిలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా నిరంతరం జెండర్‌ సెన్సిటైజేషన్‌ వర్క్‌షాపులు ఏర్పాటు చేయాలి. వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణనిప్పించి  అమ్మాయిలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకునేందుకు చర్యలు తీసుకోవాలి. స్వీయ రక్షణ కోసం నిరంతర శిక్షణ కార్యక్రమాలు  నిర్వహించాలి.  

సమాన అవకాశాలు...  
స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల హింసను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రంగాల్లో మహిళలకు 50శాతం అవకాశాలు కల్పించాల్సిందేనని మహిళా సంఘాలు చెబుతున్నాయి. విద్య, ఆరోగ్యం, జీవితబీమా, బ్యాంకింగ్, పోలీసు, రవాణా, న్యాయ, వైద్య, ఎయిర్‌ఫోర్స్, నావిక తదితర అన్ని రంగాల్లో మహిళలు రాణించే విధంగా సమాన అవకాశాలను కల్పించి ప్రోత్సహించాలి. సమాజంలో మహిళలపై  హింసకు మద్యపానం కూడా కారణమే.  దీన్ని ఆదాయ వనరుగా భావించే  ప్రభుత్వ దృక్పథం మారాలి. మద్యం దుకాణాలను తగ్గించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల లోపే మద్యం షాపులు తెరిచి ఉంచాలి. ప్రధాన హైవేలు, బస్టాపులు, ఆలయాలు, బడులు, ప్రార్థనా స్థలాలకు సమీపంలో ఉన్న వాటిని తొలగించాలి.  
 
సామాజిక భద్రత...  
నగరంలో సుమారు 8లక్షల మంది మహిళలు గృహ కార్మికులుగా పని చేస్తున్నారు. భవన నిర్మాణ రంగంలో ఇతర అనేక అసంఘటిత రంగాల్లో మరో 10లక్షల వరకు మహిళలు ఉన్నారు. వీరి సంక్షేమం, సామాజిక భద్రతకు అంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రత్యేక వసతి గృహాలను అందుబాటులోకి తీసుకురావాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. గృహ కార్మికులకు రోజుకు 8గంటల పని, నెలకు రూ.10వేల వేతనం అందే విధంగా చూడాలి. అలాగే గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లే మహిళా కార్మికుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పాతబస్తీతో పాటు అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది మహిళలు ఉపాధి కోసం గల్ఫ్‌ బాట పడుతున్నారు. వీరి సంక్షేమం కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. భద్రత కల్పించాలి.  

నిరంతర రవాణా...
నగరంలో సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లు ప్రజా రవాణా సదుపాయంగా అందుబాటులో ఉన్నప్పటికీ... మహిళలకు అరకొర సదుపాయాలే ఉన్నాయి. మహిళల కోసం లేడీస్‌ స్పెషల్‌ బస్సులను పెంచాలి. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం వేళల్లో సుమారు 50బస్సులు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్యను  మహిళా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా పెంచాలి. అలాగే మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లలోనూ స్పెషల్‌  సర్వీసులను నడపాలి. రాత్రి 10గంటలు దాటితే క్యాబ్‌లు, ఆటోరిక్షాలు వంటి వాహనాలపైన ఆధారపడాల్సి వస్తోంది. ఈ వాహనాల్లో మహిళలకు సరైన భద్రత ఉం డడం లేదు. దీంతో 24గంటల పాటు ప్రజా రవా ణా సదుపాయాలు అందుబాటులో ఉండే విధం గా నగర రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలి.  
కులాంతర, మతాంతర వివాహాల్లో పితృస్వామ్య, కుల, మతపరమైన ఆధిపత్య హింసలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తేవాలి. పరువు హత్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాలను  రూపొందించాలి.  
పెద్దల సంరక్షణ లేని పిల్లలు, ఒంటరి మహిళలు, వికలాంగులు తదితర వర్గాలకు, నిరాశ్రయులకు ప్రభుత్వమే అన్ని విధాలుగా అండగా నిలిచి భద్రత కల్పించాలి. అలాంటి పిల్లలను చదివించి వారి భవిష్యత్తుకు భరోసాను కల్పించాలి.  

ఈసారైనా...  
కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో అన్ని వర్గాల్లాగే మహిళలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ నాలుగున్నరేళ్లలో నిరాశే మిగిలింది. మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. మరోసారి ఎన్నికలొచ్చాయి. ఈసారైనా రాజకీయ పార్టీలు మహిళల సంక్షేమంపై దృష్టి సారిస్తాయని ఆశిస్తున్నాం.  – సజయ, సామాజిక కార్యకర్త 

మరిన్ని వార్తలు