సీఎం కేసీఆర్‌ నివాసంలో రక్షాబంధన్‌

15 Aug, 2019 18:09 IST|Sakshi

వేడుకల్లో పాల్గొన్న కుటుంబసభ్యులు

సాక్షి, హైదరాబాద్ : ప్రగతిభవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన అక్కచెల్లెళ్లతో పాటు పలువురు మహిళలు గురువారం రాఖీ కట్టారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఆయన సోదరి కవిత రాఖీ కట్టారు. ముందుగా కేటీఆర్‌కు బొట్టు పెట్టి హారతి ఇచ్చి ‘కేటీఆర్‌’ పేరుతో ఉన్న రాఖీ కట్టి స్వీట్‌ తినిపించారు. ఆ తర్వాత సోదరుడి వద్ద కవిత ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌కు కూడా కవిత రాఖీ కట్టారు. ‘కొన్ని బంధాలు నిజంగా ప్రత్యేకమైనవి’ అంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. సంతోష్‌ కుమార్‌ సతీమణి కూడా కేటీఆర్‌కు రాఖీ కట్టి స్వీట్‌ తినిపించారు.


అలాగే రక్షాబంధన్‌ సంప్రదాయాన్ని జూనియర్స్‌ కూడా ఫాలో అవుతున్నారంటూ కవిత కూడా ట్విటర్‌లో ఫోటోలు పెట్టారు. 

సీఎం జగన్‌కు రాఖీ కట్టిన వాసిరెడ్డి పద్మ


అలాగే స్వాతంత్ర దినోత్సవంతో పాటు ఇవాళ రక్షాబంధన్ కూడా కావడంతో  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు రాఖీలు కట్టారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత జరిగిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభం సందర్భంగా పలువురు మహిళా వాలంటీర్లు సీఎం జగన్‌కు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలు
మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాజ్‌భవన్‌లలో కూడా రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లో తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌, విజయవాడలో ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పలువురు విద్యార్థులు, బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి ఆశీస్సులు అందుకున్నారు.

మరిన్ని వార్తలు