మహిళా ఓటర్లే కీలకం

21 Nov, 2018 16:33 IST|Sakshi

వైరానియోజకవర్గంలో మహిళా ఓటర్లే కీలకం

కొణిజర్లలో ఎక్కువ, జూలూరుపాడులో తక్కువ

2018లో పెరిగిన ఓటర్లు

 వైరా: ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో మహిళా ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేయగలిగేవిధంగా ఆధిక్యంలో ఉన్నారు. పురుషుల కంటే..వీరి ఓట్లే ఎక్కువగా ఉండడంతో..అభ్యర్థులు నారీమణులను అభ్యర్థించుకుంటూ..ఓట్లేయాలంటూ విన్నవించుకుంటున్నారు. రానున్న ఎన్నికల తరుణానికి ఇప్పటికే పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల రణరంగంలో పాలకులను ఎన్నుకునేందుకు ఓటర్లూ సిద్ధంగా ఉన్నారు. యువ ఓటర్లు తమ ఓటుహక్కును నమోదు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైరా నియోజకవర్గంలో ఓటర్ల నూతన జాబితాను అధికారులు ప్రకటించారు. గత సార్వత్రికం నాటికంటే ప్రస్తుతం మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. పాలకులను ఎన్నుకునే క్రమంలో మహిళలదే  ప్రతిసారీ పైచేయిగా ఉంటోంది. నియోజకవర్గలో మొత్తం 1,73,672 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 86,876 మంది. మహిళా ఓటర్ల సంఖ్య 87,391. 515మంది ఎక్కువగా ఉన్నారు. కొణిజర్ల ఓటర్ల సంఖ్య అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం 22,204 మంది ఉన్నారు. అనంతరం రెండో స్థానంలో వైరా ఉంది. ఇక్కడ 20,812 మంది ఓటర్లు ఉన్నారు. మూడో స్థానంలో కారేపల్లి, నాలుగో స్థానంలో ఏన్కూరు మండలాలు నిలిచాయి. 12,571 ఓటర్లతో జూలూరుపాడు అయిదో స్థానంలో నిలిచింది.

పెరిగిన క్రమం ఇలా..
నియోజకవర్గాల పునర్వివిభజనలో భాగంగా 2009లో వైరా కొత్తగా ఏర్పడింది. ఐదు మండలాలతో కలిపి ఆవిర్భవించిన ఈ కేంద్రంలో తొలిసారిగా 2009లో 1,49,338 మంది ఓటర్లు ఉన్నారు. అప్పట్లో పురుష ఓటర్ల సంఖ్య 74,173గా ఉండగా మహిళా ఓటర్లు 75,165మంది ఉన్నారు. నాటి సార్వత్రిక తరుణంలోనూ మహిళా ఓటర్ల సంఖ్య 992 మంది ఎక్కువగా ఉన్నారు. 2009తో పోల్చితే ప్రస్తుతం ఉన్న ఓటర్లు 24,334 మంది అదనంగా నమోదయ్యారు. మొత్తంగా నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఓటర్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూనే ఉంది. కేవలం పదేళ్లలో 24 వేలకుపైగానే అదనంగా ఓటర్లుగా నమోదయ్యారు. మహిళల ఓట్ల సంఖ్యపెరుగుతుండటం విశేషం.    

మరిన్ని వార్తలు