అమ్మ ప్రేమ గెలిచింది  

15 Aug, 2018 13:41 IST|Sakshi
పెంచిన తల్లికి బిడ్డను అప్పగించిన అధికారులు

నాలుగు నెలల పోరాటంతో బిడ్డను దక్కించుకున్న హైమావతి

పెంచిన తల్లికి బిడ్డను అప్పగించిన అధికారులు

నర్సంపేట : కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతీ దేవత అమ్మే  కదా... అనే సినీగీతాన్ని సార్థకం చేసింది ఓ పెంపుడు తల్లి ఉదంతం..  సరిగ్గా ఏడాది క్రితం నర్సంపేట బస్టాండ్‌ సమీపంలో ఓ మహిళకు పసిపాప దొరకగా అక్కున చేర్చుకుంది. చావుబతుకుల్లో ఉన్న పాపకు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స చేయించి పెంచుకుంది.  అయితే తను కట్టుకున్న భర్త చైల్డ్‌లైన్‌ వెల్ఫేర్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో నాలుగు నెలల క్రితం వారు బిడ్డను స్వాధీనం చేసుకున్నా రు.

చట్టం ఒప్పుకోదనే సాకుతో అమ్మ ప్రేమకు దూరం చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆ పెంపుడు తల్లి అధికారులను ప్రతిఘటించి న్యా య పోరాటం చేసింది. ఆమె పోరాటం ఫలించి ఆ బిడ్డను తానే దక్కించుకుంది. మంగళవారం అధికారికంగా ఆ బిడ్డను అధికారుల నుంచి స్వాధీనం చేసుకుని తల్లిప్రేమను చాటుకుంది.  నర్సంపేట పట్టణంలో నివాసముంటున్న దాసరి హైమావతిది చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం గ్రామం.. 25 సంవత్సరాల క్రితం సాంబయ్య అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది.

సంతానం కలగకపోవడంతో భర్త సాంబయ్య హైమావతితో గొడవపడి చాలా కాలంగా వేరొక మహిళతో కలిసి ఉంటున్నాడు.  న్యాయం చేయాలని పెద్దమనుషులను ఆశ్రయించడంతో నెలకు రూ.3000లు భర్త నుంచి ఇప్పించేందుకు రాజీ కుదిర్చారు.  ఈ క్రమంలోనే 2017 ఆగస్టులో పట్టణంలోని బస్టాండ్‌ వద్ద .. పాన్‌షాపుల మధ్యలో పసిగుడ్డు అరుపులు వినపడింది.. అటుగా వెళ్తున్న హైమావతి గమనించి   బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉండగా అక్కున చేర్చుకుని ఆస్పత్రికి తీసుకెళ్లింది.

స్థానికంగా ఉన్న వైద్యులు పాప పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తీసుకువెళ్లి బతికించుకుంది. నాటి నుంచి ఆ పాపను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటోంది. తనపేరుతో ఉన్న కొద్దిపాటి ఆస్తి.. హైమావతి పెంచుకుంటున్న పాపకు దక్కుతుందనే దురుద్దేశంతో భర్త సాంబయ్య బెదిరింపులకు దిగి 2018 ఏప్రిల్‌ 13న చైల్డ్‌లైన్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

అదేరోజు అధికారులు హైమావతి నివసిస్తున్న ఇంటికి వచ్చి పాప గురించి వివరాలు తెలుసుకున్నారు. ఏప్రిల్‌ 16న బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరచగా విచారణ చేస్తున్న క్రమంలోనే.. పాపను తన నుండి దూరం చేయవద్దని తన పేర ఉన్న ఆస్తిని పాప పేరిట రిజిస్టర్‌ చేయిస్తానని హైమావతి వేడుకుంది . ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 30న జిల్లా కలెక్టర్‌ హరిత వద్దకు నర్సంపేటకు చెందిన కౌన్సిలర్‌ బండి ప్రవీణ్‌ , అంగన్‌వాడీ సంఘం బాధ్యురాలు నల్లా భారతితో కలిసి వెళ్లి విన్నవించింది.

దీంతో కలెక్టర్‌ మే 5న సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ ముందు హాజరుకావాలని సూచిం చారు. హైమావతి పోరాటానికి మహిళా సంఘాలు మద్దతుగా నిలుస్తూ సంఘీభావాన్ని తెలిపా యి. ఇటీవల చైల్డ్‌వెల్ఫేర్‌  కమిటీ నూతన చైర్మన్‌ మండల పరశురాములును కలిసి  పాపను తనకు ఇవ్వాలని వేడుకుంది. ఎట్టకేలకు మంగళవారం చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ బాధ్యులు పాపను పెంచుకునేందుకు అధికారికంగా అంగీకరించి హైమావతికి అప్పగించారు.  దీంతో ఆమె పోరాటం విజయవంతమైంది. కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం డివిజన్‌ అధ్యక్షుడు కామిశెట్టి రాజు, సీపీఐ ఎంఎల్‌ పార్టీ డివిజన్‌ కార్యదర్శి మోడెం మల్లేషం  పాల్గొని పెంపుడు తల్లికి బిడ్డను ఇవ్వడంపై అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు