మేమూ అమ్ముతాం!

23 Sep, 2017 01:18 IST|Sakshi

మద్యం వ్యాపారంలోకి మహిళలు

ఏకంగా 10 వేల మంది పోటీ

284 షాపులు కైవసం

ప్రశాంతంగా ముగిసిన లక్కీ డ్రా

సాక్షి, హైదరాబాద్‌: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. ఇద్దరూ చెరో మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకున్నారు. లక్కీ డ్రాలో ఇద్దరినీ అదృష్టం వరించింది. చెరో దుకాణం వచ్చింది. మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఓ మద్యం దుకాణానికి 12 మంది మహిళలు పోటీపడ్డారు. చివరికి డ్రాలో జ్యోతి అనే యువతికి దుకాణం దక్కింది. ..

ఇలా ఒక్కరిద్దరు కాదు.. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈసారి దాదాపు 10 వేల మంది మహిళలు మద్యం దుకాణాల లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారిలో 284 మందికి లైసెన్స్‌లు దక్కాయి. శుక్రవారం సెంటిమెంట్, అదే రోజున లక్కీ డ్రా తీస్తుండటంతో పలువురు వ్యాపారులు తమ భార్య, కూతుళ్ల పేరిట దరఖాస్తులు చేసుకున్నారు. దాదాపు 10 శాతం షాపులను మహిళలే దక్కించుకోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 2,216 వైన్‌షాపుల ఏర్పాటు కోసం శుక్రవారం ఎక్సైజ్‌ శాఖ నిర్వహించిన లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 135 మంది మహిళలకు లైసెన్సులు దక్కాయి.

66 దుకాణాలు పెండింగ్‌
ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దాదాపు 66 మద్యం దుకాణాలకు ఇంకా లాటరీ నిర్వహించలేదు. ఇక్కడ ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతే దుకాణాల ఏర్పాటు, నిర్వహణ చేయాలనే నిబంధన ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 40, మహబూబాబాద్‌లో 9, భూపాలపల్లి జిల్లాలో 17 దుకాణాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. గిరిజనుల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే అక్కడ దుకాణాలు ఏర్పాటు చేస్తామని భూపాలపల్లి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శశిధర్‌రెడ్డి తెలిపారు. వీటితో పాటు హైదరాబాద్‌లో ఒక మద్యం దుకాణానికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. సోమాజిగూడలో ఓ మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకున్న వ్యాపారికి అంతకు ముందే మరో దుకాణం లైసెన్స్‌ దక్కింది. ఒకే వ్యక్తికి రెండు లైసెన్స్‌లు ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించకపోవటంతో రెండో లైసెన్స్‌ను రద్దు చేశారు.

వీళ్లది ఏం లక్కుపో..
మహబూబ్‌నగర్‌లోని భగీరథ కాలనీలో మద్యం దుకాణానికి 56 దరఖాస్తులు వచ్చా యి. రవీందర్‌ అనే వ్యాపారి ఒక్కరే వేర్వేరు పేర్ల మీద 30 దరఖాస్తులు వేశారు. అదృష్ట దేవత ఆయన్ను పక్కనపెట్టి ఒకే ఒక్క దరఖాస్తు దాఖలు చేసుకున్న వినోద్‌ అనే వ్యక్తిని వరించింది. సూర్యాపేట జిల్లా జాన్‌ప హాడ్‌లో మద్యం దుకాణానికి 134 దరఖాస్తులు రాగా.. అందులో ముగ్గురు వ్యాపారులే తమ వారి పేరిట సుమారు 40 వరకు దరఖాస్తులు వేశారు. కానీ ఒక్క దరఖాస్తు వేసిన లచ్చిరెడ్డికి దుకాణం దక్కింది. కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలంలో ఆంజనేయులు అనే వ్యాపారి రెండు దుకాణాలకు 7 దరఖాస్తులు వేసినా ఒక్క లైసెన్సూ దక్కలేదు. ఆయనే తన వారి పేరిట మరోచోట సింగిల్‌ దరఖాస్తు వేయగా.. అక్కడ అదృష్టం వరించింది.

మద్యం దుకాణాలు దక్కించుకున్న మహిళలు జిల్లాల వారీగా..
జిల్లా              సంఖ్య
రంగారెడ్డి       136
వరంగల్‌       39
నల్లగొండ       25
హైదరాబాద్‌    16
ఖమ్మం    13
మహబూబ్‌నగర్‌    11
మెదక్‌    19
కరీంనగర్‌    11
నిజామాబాద్‌    8
ఆదిలాబాద్‌    6

మరిన్ని వార్తలు