మా గోడును వినిపించుకునేదెవరు?   

26 Jul, 2018 14:13 IST|Sakshi
 సబ్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వాహనాన్ని అడ్డుకుంటున్న మెప్మా ఆర్పీలు  

బోధన్‌ నిజామాబాద్‌ : తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదనతో మెప్మా ఆర్పీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బోధన్‌ మున్సిపల్‌ ఆఫీసు లోపల నుంచి బయటకు వస్తున్న సబ్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వాహనాన్ని మున్సిపల్‌ ఆఫీసు ప్రవేశ ద్వారం వద్ద అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆర్పీలను సముదాయించే ప్రయత్నం చేస్తూ వాహనాన్ని తహసీల్‌ ఆఫీసు వైపు మళ్లీంచారు.

స్థానిక మున్సిపల్‌ ఆఫీసులో చైర్మన్‌ ఆనంపల్లి ఎల్లయ్యపై కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస నోటీసు మేరకు బలపరీక్షకు కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 గంటల వరకు కౌన్సిలర్ల కోరం లేక పోవడంతో సమావేశం వాయిదా వేసి తిరిగి సబ్‌ కలెక్టర్‌ ఆఫీసుకు వెళ్తున్న ఆయన వాహనాన్ని మున్సిపల్‌ ప్రవేశ ద్వారం వద్ద మెప్మా ఆర్పీలు అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్పీలు ఆగ్రహానికి గురై నినాదాలు చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, 22 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలిపినా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం సబ్‌ కలెక్టర్‌ ఆఫీసుకు ర్యాలీ వెళ్లి నిరసన తెలిపారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సమస్యలు పరిష్కరించాలని మెప్మా ఆర్పీలు 22 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తూ రిలే నిరహార దీక్షలు కొనసాగిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు