వంట.. ఫుడ్‌ లేదు, పిల్లలూ లేరు..

18 Jul, 2018 09:13 IST|Sakshi
మదనపల్లిలోని కేంద్రంలో పిల్లలకు బదులుగా వేరే పిల్లను కేంద్రానికి తీసుకొచ్చిన దృశ్యం

ధారూరు వికారాబాద్‌ : అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, తల్లులు, గర్భిణులకు ఇవ్వాల్సిన ఫుడ్డు, గుడ్డు లేకపోడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళా శిశు సంక్షేమశాఖ రీజినల్‌ ఆర్గనైజర్‌ వీరమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని నాగారం, దోర్నాల్, మదన్‌పల్లి, బానాపూర్, మదన్‌పల్లితండాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను చూసి ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు.

రికార్డుల్లో ఓ రకంగా, వాస్తవంగా మరోరకంగా ఉండడం, పిల్లలు, తల్లులు, గర్భిణులకు ప్రతీరోజు వండి పెట్టేందుకు ఆహార పదార్థాలు లేకపోయిన, వండి పెడుతున్నట్లు టీచర్లు చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలు రాకున్నా వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. వండి తినబెడుతున్నామని చెప్పడం, వంట వండటం అనేది నీటిమీద రాతలనీ అక్కడే ఉన్న కొంతమంది చెప్పడంతో అబద్దాలు ఎందుకు చెబుతున్నారని ఆమె టీచర్లను నిలదీశారు.

ఆహార పదార్థాలు ఇళ్లకు పంపిణీ చేసినట్లు ముందుగానే రికార్డుల్లో తల్లులు, గర్భిణుల సంతకాలు తీసుకోవడంతో ఆమె మండిపడ్డారు. నెలకు రెండుసార్లు ఇవ్వాల్సిన గుడ్లు ఇవ్వకున్నా ఇచ్చినట్లు సంతకాలు తీసుకోవడం తనిఖీల్లో బయటపడింది. సూపర్‌వైజర్‌ సుశీల తరుచూ తనిఖీ చేస్తున్నారా అంటే లేదనే సమాచారం. పంపిణీ చేసినట్లు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నిస్తే మౌనం వహించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

వికారాబాద్‌ పీడీ, సూపర్‌వైజర్లు బాద్యతా రాహిత్యంతోనే అంగన్‌వాడీ కేంద్రాలు అస్తవ్యస్తం అవుతున్నాయ ని ఆమె పేర్కొన్నారు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలనీ ఉన్నతాధికారులకు నివేదిక పంపను న్నామన్నారు. మదన్‌పల్లితండాలో టీచరు, ఆయా లేకపోయిన ఉన్నట్లు అక్కడి వారు చెప్పడంపై ఆశ్చర్యానికి గురిచేసింది. అంగన్‌వాడిల్లో జరుగుతున్న అవకతవకలను క్షుణ్ణంగా పరిశీలించిన వివరాలు నమోదు చేసుకుని వెళ్లిపోయారు.  

మరిన్ని వార్తలు