మహిళా.. వందనం

8 Mar, 2015 02:07 IST|Sakshi

నిను చులకనగా చూస్తున్న సమాజానికి చుక్కానిలా నిలిచావు అవమానాలెన్ని ఎదురైనా అన్నింటా మేటిగా రాణించావు కలుపుతీసి.. కోత కోసి బంగారం పండించావు ఆకాశం నిండా నేనేనంటూ గగనతలంలో విహరించావు మోటారు వాహనాలను నడుపుతూ ముందుకు దూసుకుపోయావ్ ఆత్మీయత పంచి.. అనురాగం పెంచి సమాజగమనాన్ని నిర్దేశించావు ఆడపిల్లవు.. నీకెందుకులే అన్న సమాజాన్ని ముందడుగు వేయించావు చదువు.. ఆట పాటలే కాదు.. తుపాకీ భుజానికెత్తుకొని కాపలాకాసి దేశానికి భద్రతనిచ్చావు ఆడపిల్ల ఏం చేస్తుందిలే అన్న సమాజపు అహంకారంపై సవాల్ విసిరి విజయబావుటా ఎగురవేశావు అల్లరిమూకల ఆడగాలు ‘నిర్భయ’ంగా ఎదుర్కొంటూ జీవనసమరంలో దూసుకుపోతున్న మహిళా..  సమాజంలో ఎందుకీ దుర్గతి.. ఆడపిల్ల పుడితే అరిష్టమని భావిస్తున్నారెందుకు...?
 పుట్టేది ఆడపిల్ల అని తెలుసుకొని నిన్ను కడుపులోనే చంపుతున్నారు... అక్కడో.. ఇక్కడో.. ఒకరో.. ఇద్దరో..పుట్టినా వరకట్న పిశాచాలకు బలవుతూనే ఉన్నారు కొందరు కామాంధులు నిలువునా దహించి వేస్తున్నారు ఇన్ని అవరోధాలు తట్టుకొని జీవిస్తూ కుటుంబానికి.. దేశానికి వెలుగునిస్తున్న ఓ మహిళా నీకు వందనం....
 
 జీవితమంతా కళాసేవకే అంకితం
 వనపర్తి: చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న సంప్రదాయ నృత్యాన్ని కాలక్షేపం కోసం కాకుండా ప్రాచీన కళలను బతికించాలన్న తపనతో ఆమె తలపెట్టిన సంకల్పం నేడు ఎందరినో కూచిపూడి కళాకారులుగా మార్చింది. 40ఏళ్లుగా కూచిపూడిలో దాదాపు 3వేల మంది చిన్నారులకు శిక్షణ ఇచ్చిన కుమారి నీరజాదేవి జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. వివిధ వేదికలపై వనపర్తి కళాకారులు అందెల సవ్వడి చేస్తూ అలరిస్తున్నారు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితానంతా కళారంగానికే అర్పించారు.
 
  తనవద్ద నృత్యం నేర్చుకున్న చిన్నారులే తన బిడ్డలుగా భావిస్తూ ఆమెవారికి గోరు ముద్దలు పెట్టినట్లుగా ‘దిద్దితై దిద్దితై’ అంటూ చిన్నారులను తన లోకంలోకి తీసుకెళ్తుంది. నీరజాదేవికి ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు ఆమె తల్లితండ్రులు యశోదమ్మ ,శ్రీనివాసభగవాన్‌లు కర్నూలులోని ఏలేశం సూర్యప్రకాశంశర్మతో కూచిపూడి నృత్యం నేర్పించారు. ఆ తర్వాత వనపర్తికి వచ్చిన ఆమె  1979లో స్వర్ణముఖి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి, చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ఆమె వద్ద శిక్షణ తీసుకున్న ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. ఒకప్పుడు బాగా డబ్బున్న వారు మాత్రమే నేర్చుకునే కూచిపూడి నృత్యాన్ని ఆమె పేద, మధ్య తరగతి వారికి అందుబాటులోకి తెచ్చారు.నృత్యంలోని అభినయాన్ని క ళ్లకు కట్టినట్లు కనిపించే విధంగా చిన్నారులకు ఆమె శిక్షణ ఇస్తున్నారు.
 
 కూచిపూడి ఒక నృత్య విధానమే కాదని దానిద్వారా చిన్నారులకు మనదేశ సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయని, అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతోందని ఆమె అంటున్నారు. విదేశాల్లో తమ పిల్లలకు కూచిపూడి నృత్యం నేర్పిస్తే వేల డాలర్లు ఇస్తామనే వారున్నారని, తనకు మారుమూల ప్రాంతాల పిల్లలకు నేర్పించాలనే తపనే ఇక్కడ ఉండేలా చేసిందని నీరజాదేవి చెబుతున్నారు.
 
 కలలో కూడా ఊహించలేదు...
 గృహిణిగా ఉన్న నేను 2006లో రేషన్‌షాపు డీలర్‌గా ఎంపికయ్యా. ఎనిమిదేళ్లపాటు పని చేశాను. నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీ బీసీ మహిళకు రిజర్వేషన్ కావడంతో మాజీ జెడ్పీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశా. ప్రజలు నన్ను ఆదరించారు. 1842ఓట్ల మెజార్టీతో గెలిపించారు. నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధిని అవుతానని కలలో కూడా ఊహించలేదు. ఇది అదృష్టంగా భావిస్తా. మహిళలు రాజకీయంగా ఈ సమాజంలో పురుషులతో సమానంగా ఎదగాల్సిన అవసరం ఉంది.
 
 మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు ఆత్మవిశ్వాసం చాలా అవసరం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సక్రమమైన పాలన అందిస్తే ఎప్పటికీ గుర్తింపు ఉంటుందనేది నా నమ్మకం. ఈ రోజు పార్టీ కూడా నన్ను గుర్తించి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్‌లో మహిళా బిల్లును ప్రవేశపెట్టి  పురుషులతో సమానంగా అవకాశం కల్పిస్తే నాలాంటి వనితలు ఎందరికో ఎన్నో అవకాశాలు దక్కుతాయి.
 - కొండా మణెమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు, నాగర్‌కర్నూల్ రూరల్
 
  తపాలాబిళ్లపై ‘మహిళ’ ముద్ర
 దేవరకద్ర రూరల్: ఏదేశమైన మహిళకు అత్యున్నత స్థానం ఇచ్చింది. అన్ని రంగాల్లో ఆమె పాత్ర ఉన్నతమైంది. తల్లిగా, చెల్లిగా, మార్గదర్శిగా, వీరనారిగా, ఉపాధ్యాయురాలిగా, అర్థాంగిగా, కవయిత్రిగా, నటిగా, సేవకురాలిగా, శాస్త్రజ్ఞురాలిగా ....ఇలా ఏరంగంలో చూసినా ప్రస్తుత తరుణంలో మహిళలు ముందుకు దూసుకెళ్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా మహిళ తన ముద్ర (స్టాంపు)వేసింది. దేవరకద్ర మండలం పేరూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కవి కమలేకర్ శ్యాంప్రసాద్‌రావు పదిహేనేళ్లుగా మహిళల స్టాంపులను సేకరించి భద్రపరుచుకున్నారు. ఈ స్టాంపుల్లో  భారత తపాలాశాఖ ముద్రించిన మహిళామణుల స్టాంపుల ద్వారా ఎందరో భారత మహిళల గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి.  
 
 తొలి తపాలాబిళ్లపై మహిళాచిత్రం
 ప్రపంచంలో మీద మొదటి తపాలాబిళ్ల‘ పెన్నిబ్లాక్ ’ అనే పేరుతో 1840 మే 6న లండన్‌లో విడుదల చేశారు. బ్రిటీష్ రాణి చిత్రంతో ఈ తపాలాబిళ్ల ఆవిష్కతమైంది. అలాగే మనదేశంలో 1854 సెప్టెంబర్‌లో బ్రిటీష్ ప్రభుత్వం ద్వారా విడుద లైన తొలి తపాలాబిల్లపై ‘విక్టోరియా రాణి’ చిత్రంతో ముద్రించడం గమనార్హం. 1943లో గవర్నమెంట్ ఆఫ్ ఆజాద్ హింద్ ముద్రించిన తపాలాబిల్లలో ‘చరకా తిప్పుతున్న మహిళ’ చిత్రాన్ని ముద్రించారు. స్వాతంత్య్ర భారతంతో 1952లో భక్త కవయిల్రి ‘మీరాబాయి’చిత్రంతో తపాలాబిళ్ల విడుదలైంది. తెలంగాణ ప్రాంతంలో భారత కోకిలగా పేరుగాంచిన సరోజిని నాయుడు స్మారకార్థం ఆమె చిత్రంతో 1964లో స్టాంపును విడుదల చేశారు.
 
 మనదేశంలో మహిళల స్టాంప్‌లు
  చాలామంది మహిళా చిత్రాలతో స్టాంపులు విడుదలయ్యాయి. ప్రథమ స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన ఝాన్సీ లక్ష్మీబాయి స్మారక తపాల బిళ్లను 1957 ఆగస్టు 17న విడులైంది. 960లో మహాకవి కాళిదాసు నాటకంలోని‘ శకుంతల’ చిత్రంతో స్టాంపు వచ్చింది.
 
 1962లో మేడం బికాజీ కామ మహిళ పేరుతో, 1963లో డాక్టర్ అనిబిసెంట్, 1963లో రోజ్‌వెల్డ్, 1964లో దీపలక్ష్మీ , కస్తూర్బగాంధీ, 1968లో సిస్టర్ నివేదిత , 1969లో గాంధీజీతో కస్తూర్బా , 1970లో గర్ల్‌గైడ్, 1971లో అభిసారిక(ఆర్ట్), 1973లో రాధ (ఆర్ట్) , 1974 కమలానెహ్రూ, 1975 సరస్వతి (శిల్పం), భారతీయ లలిత కళలు, 1976లో కవయిత్రి సుభద్రకుమారి చౌహాన్, 1977 మాతృమూర్తి(శిల్పం), కిట్టుర్ రాణి చెన్నమ్మ , 1978లో తత్వవేత్త మదర్ , 1980లో హెలెన్ కిల్లర్ , మదర్‌థెరిస్సా, 1980లో భారతీయ పెళ్లి కూతురు, 1981లో భారతీయ గిరిజన మహిళ, 1982 దుర్గాబాయ్ దేశ్ ముఖ్, 1984లో ఇందిరా గాంధీ, 1987లో రుక్మిణీదేవి (డ్యాన్సర్),  రామేశ్వరీ నెహ్రూ, ఆనంద్ మయి, 1988 రాణీ అవంతీ బాయి, రాణీ లక్ష్మీబాయి, రాణి దుర్గావతి, 1989లో రాజ్‌కుమార్ అమృత్‌కౌర్, పండిత రమాబాయి. 1990లో ధ్యానేశ్వరి, 1993లో నర్గీస్ (నటి)ల మహిళల చిత్రాలతో స్టాంపులు విడుదలయ్యాయి.  
 

మరిన్ని వార్తలు