అప్పు చెల్లించలేదని మహిళల నిర్బంధం

22 Dec, 2017 03:05 IST|Sakshi

రెండు రోజులుగా ఇంట్లో ఉంచి తాళం వేసిన వడ్డీ వ్యాపారి

సిరిసిల్ల టౌన్‌: అప్పు చెల్లించలేదని ఆగ్రహిస్తూ ఓ వడ్డీ వ్యాపారి దారు ణానికి ఒడిగట్టాడు. భర్త చేసిన అప్పు తీర్చాలంటూ.. అతని భార్య తోపాటు తల్లినీ ఇంట్లో ఉంచి రెండ్రోజులుగా తాళం వేసి వెళ్లిన సంఘటన గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. జిల్లాకేంద్రంలోని సుభాష్‌ నగర్‌కు చెందిన కుడిక్యాల కృష్ణ పదేళ్లుగా పెట్టీకోట్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. స్నేహితులను నమ్మి ఆర్థికంగా నష్టపోయాడు. ఈ క్రమంలో రూ.20 లక్షలు అప్పు చేశాడు.

2 నెలల క్రితం కోర్టు ద్వారా రుణదాతలకు ఐపీ (ఇన్‌సాల్వెన్స్‌ పొజిషన్‌) నోటీసులు పంపించాడు. అప్పట్నుంచి అప్పుల వారికి భయపడి.. ఇంట్లో కూడా చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. ఆయన భార్య తార, కూతురు అమూల్యతో అత్తగారింట్లో ఉంటోంది. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన వడ్డీ వ్యాపారి బండారి ఆంజనే యులు తనకు కృష్ణ రూ.2 లక్షలు బాకీ ఉన్నాడంటూ.. అవి చెల్లించాలని కొద్దిరోజులుగా తార, కృష్ణ తల్లి లక్ష్మిని వే«ధిస్తున్నాడు.

తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రాధేయపడినా.. వినకుండా బుధవారం వారిని ఇంట్లో ఉంచి బయట తాళం వేశాడు. గమనించిన స్థానికులు తాళం పగులగొట్టారు. విషయం తెలుసుకున్న ఆంజనేయులు గురువారం కూడా వచ్చి స్థానికులను దూషిస్తూ.. తార, లక్ష్మిని ఇంట్లో ఉంచి మళ్లీ తాళం వేశాడు. దీంతో బాధితులు 100, మీడియాకు సమాచారం ఇచ్చి వారి బాధను వివరించారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.

మరిన్ని వార్తలు