మహిళావిద్యను ప్రోత్సహించాలి

17 Mar, 2019 02:58 IST|Sakshi

మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి 

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

హైదరాబాద్‌: మహిళా విద్యను సమాజంలోని అన్ని సంస్థలు ప్రోత్సహించాలని, తద్వారా వారికి మరింత గౌరవం దక్కుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వేదకాలం నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనదన్నారు. తార్నాకలో శనివారం జరిగిన సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ మహావిద్యాలయ కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు ఆయన పలువురు విద్యార్థినులకు బంగారు పతకాలు అందజేశారు. మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుందని, 71 ఏళ్ల భారతావనిలో నేటికి 20% నిరక్షరాస్యత ఉందని, అందులో మహిళల శాతం ఎక్కువగా ఉండటమే బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మహిళల పట్ల వివక్ష, వేధింపులు జరగడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నేడు అన్ని రంగాల్లో మహిళలే ముందున్నట్లు ఆయన చెప్పారు.

మహిళా విద్యకు సరోజినీదేవి విద్యా సంస్థలు, ఎగ్జిబిషన్‌ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వెంకయ్యనాయుడు కొనియాడారు. నేడు భారతీయులే సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. పాశ్చాత్య దేశాల సంస్కృతిని అనుసరిస్తే ఆరోగ్యానికి, మన సంస్కృతికి హానీ చేయడమే అవుతుందని హితవు పలికారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ రానున్న కాలంలో బలోపేతం అవుతుందని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు దేశంలో అత్యంత చౌకధరల్లో నాణ్యమైన ఔషధాలు లభిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ ఫార్మాస్యూటికల్‌ హబ్‌గా మారిందని, పలు అరుదైన వ్యాధు లు, రోగాల నివారణకు అవసరమైన మందుల కోసం విద్యార్థులు పరి శోధనలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ వీరేందర్, కళాశాల కార్యదర్శి సుకేష్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జ్యోతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. 

>
మరిన్ని వార్తలు