'సదరం' వద్ద తోపులాట, స్పృహ తప్పిన మహిళలు

17 Oct, 2014 11:49 IST|Sakshi

నిజామాబాద్ : సామాజిక పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ సామాన్యులకు ప్రాణాంతకంగా మారింది. వికలాంగ పింఛన్లు కోరుకునే వారికి సదరం సర్టిఫికెట్లు తప్పని  సరిగా ఉండాలనే నిబంధనతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి వద్ద శుక్రవారం సదరం శిబిరం వద్ద తోపులాట జరిగింది. ధ్రువ పత్రాల కోసం వేలాదిమంది వికలాంగులు, వృద్ధులు సదరం కేంద్రాల వద్దకు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.

ఈ ఘటనలో నలుగురు మహిళలు స్పృహ తప్పిపడిపోయారు. దాంతో వారికి చికిత్స అందిస్తున్నారు.  వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా వేయిరూపాయలు, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకు 40శాతం వైకల్యమున్న వారికే వికలాంగ పింఛన్ మంజూరవుతుంది. దాంతో గతంలో సదరం పరీక్షలో 40 శాతం పొందలేక పోయిన వారు మరోమారు ధ్రువీకరణ పత్రాల కోసం వస్తుండటంతో గందరగోళం నెలకొంటోంది.

మరిన్ని వార్తలు