ముడుపులు వాపస్

10 Jan, 2015 06:06 IST|Sakshi
ముడుపులు వాపస్

* మహిళా సంఘాలకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్న ఆర్పీలు
* తమపై విచారణ కమిటీకి ఫిర్యాదు చేయవద్దంటూ వినతులు
* సీఓను కాపాడే ప్రయత్నంలో అధికారులు

ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులు బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యవహారంపై ‘సాక్షి’ దినపత్రికలో వరస కథనాలు ప్రచురితం కావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎలాగైనా తప్పించుకోవడానికి పలువురు ఆర్పీలు ప్రయత్నాలను ముమ్మరం చేసారు.

ఇన్ని రోజులుగా మహిళా సంఘాలను బెదిరించి, భయపెట్టి వసూలు చేసిన ముడుపులను ఆయా సం ఘాల సభ్యులకు తిరిగి ఇచ్చి వేస్తున్నారు. తమపై విచారణ జరపడానికి వచ్చిన అధికారులకు తమపై ఎలాంటి ఫిర్యాదు చేయవద్దని మహిళా సంఘాల సభ్యులకు విన్నవించుకుంటున్నారు. ఎవరైనా సంఘం సభ్యులు అందుబాటులో లేకపోతే సదరు ఆర్పీలు ఫోన్లు చేసి మరీ సభ్యుల ఇంటికి వెళ్లిడబ్బులు అప్పజెప్పి వస్తున్నారు.
 
ఇదిలా ఉండగా ఈ ముడుపుల వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కమ్యూనిటీ ఆర్గనైజర్ (సీవో)ను విచారణ నుం చి తప్పించడానికి జిల్లా కేంద్రంలోని మెప్మా ఉద్యోగులతో పాటు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి చెందిన ఒక అధికారి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీవోతో కలిసి మహిళా సంఘాల నుంచి బల వంతపు వసూళ్లు చేసిన ఆర్పీలు తమ వంతుగా తీసుకున్న మొత్తాన్ని మాత్రమే తిరిగి చెల్లిస్తున్నారు.

సీవో వాటాగా తీసుకున్న మొత్తానికి మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు. దీంతో మెప్మా పీడీ సత్యనారాయణ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్న కమిటీ సభ్యులు మహిళా సంఘాల సభ్యులందరినీ ఒకే చోట సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు. మహిళా సంఘాల నుంచి మెప్మా ఉద్యోగుల బలవంతపు వసూళ్లపై మెప్మా ఎండీ అనితా రాంచంద్రన్‌తో పాటు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ సీరియస్ అయ్యారు.

విచారణ కోసం ఆర్మూర్‌కు వచ్చిన మెప్మా అర్బన్ పీడీ సత్యనారాయణ ముగ్గురితో కూడిన విచారణ కమిటీని వేసారు. ఆర్మూ ర్ మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీఎంసీ ఐబీ మాధురీలత, డీఎంసీ బ్యాం లింకేజీ విశ్రాంత ఉద్యోగి మోహన్‌రావు ఈ కమిటీలో సభ్యులు. అయితే ముడుపుల ఆరోపణలు వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా ఈ కమిటీ ఇప్పటికీ విచారణ ప్రారంభించకపోవడం కొసమెరుపు.
 
మహిళా సంఘాల రికార్డుల్లో అక్రమార్కుల బాగోతం..
మహిళా సాధికారతలో భాగంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి గత ప్రభుత్వాలు మహి ళా సంఘాలను ఏర్పాటు చేయిస్తూ బ్యాంకుల ద్వారా అతి తక్కువ వడ్డీకి రుణాలను అందజేయిస్తున్నారు. అయితే ఈ మహిళా సంఘాలు ఏర్పాటైన రోజు నుంచి ప్రతి సమావేశం, సమావేశంలో చర్చించిన అంశాలు, తీర్మానాలు, బ్యాంకుల నుంచి పొందిన రుణాలు, వడ్డీ, తిరిగి బ్యాంకులకు చెల్లించిన మొత్తం, సంఘం నిర్వహణకు, బ్యాంకు రుణాలు పొందే సమయంలో అయిన ఖర్చును రికార్డుల్లో విధిగా రాయాల్సి ఉంటుంది.

ప్రతి సంఘంలో సుమారు పది నుంచి 12 మంది మహిళలు సంభ్యులుగా ఉంటారు. బ్యాంకు వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల వ్యవహారాలన్ని ఆ సంఘంలో ఎంపిక చేసుకున్న లీడర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. సంఘం సభ్యులకు ఫోన్ చేసిన బిల్లును, ఆటో చార్జీలను మొదలుకొని ప్రతి పైసాకు ఆ సంఘం లీడర్లు బాధ్యులుగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మెప్మా పరిధిలో మహిళా సంఘాలకు బ్యాంకుల నుంచి మాట్లాడి రుణాలు ఇప్పించాల్సిన బాధ్యత ఉన్న సీవోతో పాటు పలువురు ఆర్పీలు సంఘాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు.


రుణం ఇప్పించినందుకు బెది రింపులకు పాల్పడుతూ ప్రతి మహిళా సంఘం నుంచి రూ. 5,000 నుంచి రూ.10,000  వరకు బలవంతపు వసూళ్లు చేసారు. అయితే సీవో, ఆర్పీలు ఈ ముడుపుల వ్యవహారాన్ని ఆయా సంఘాల లీడర్ల ద్వారా కొనసాగిం చారు. ముందుగా సంఘం లీడర్‌ను పిలిపించి తాము బ్యాంకులో రుణం ఇప్పిస్తున్నందుకు మీ సంఘం నుంచి ఇంత మొత్తం విధిగా చెల్లించాలని డిమాండ్ చేసారు.

ఆ లీడర్లు తమ సంఘం సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లి తలా ఇంత డబ్బులు వేసుకొని ముడుపులు జమ చేసి మెప్మా ఉద్యోగులకు అప్పగించారు. అయితే ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఆ మహిళా సంఘం లీడర్ తన సొంతానికి కూడా వాడుకొనే పరిస్థితులు ఉంటాయి. దీంతో అవినీతికి తావు లేకుండా లీడర్ తాము జమ చేసిన మొత్తాన్ని ఏ అధికారికి ఎంత ముడుపుల రూపంలో చెల్లించింది రికార్డులో విధిగా రాయాల్సి ఉం టుంది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని ఆ లీడరే కాజేసినట్లే అవుతుంది. విచారణ చేపట్టనున్న అధికారులు సైతం మహిళా సంఘాల సభ్యుల జమ ఖర్చులను వారి రికార్డుల్లో పరిశీలించి నిష్పక్షపాతంగా పూర్తి స్థాయి విచారణ జరిపితే బాధ్యులైన అక్రమార్కుల బండారం బయటపడే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు