వసూలు సరే.. వడ్డింపులేవీ?

23 Feb, 2015 03:49 IST|Sakshi
వసూలు సరే.. వడ్డింపులేవీ?

- మూడేళ్లుగా వడ్డీ రాయితీ విదల్చని సర్కారు
- పేరుకుపోయిన రూ.49.74 కోట్ల బకాయిలు
- ఆందోళనలో మహిళా సంఘాలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్వయంసహాయక సంఘాలు సంకటంలో పడ్డాయి. మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు తలపెట్టిన వడ్డీ లేని రుణాల పథకం.. ఆర్థిక చిక్కుల్లోకి నెట్టేశాయి.

దీంతో జిల్లాలోని మహిళలు గత మూడేళ్లుగా తీసుకున్న బ్యాంకు లింకు రుణాలకు వడ్డీ చెల్లిస్తుండడంతో ఆర్థిక బలోపేతం సంగతేమో గాని అసలుకే ఎసరు వచ్చింది. జిల్లాలోని మహిళా సంఘాలు రుణాలు పొందిన బ్యాంకులకు గత మూడేళ్లకాలంలో రూ. 106.36 కోట్ల మేర వడ్డీ చెల్లించాయి. కానీ ఈ వడ్డీ మొత్తాన్ని సర్కారు రద్దు చేసి నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం రూ. 56.59 కోట్లు చెల్లించి మమ అనిపించింది. దీంతో ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి వడ్డీ నిధులు రాకపోవడంతో మహిళలు సొంతంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది.
 
స్పందించని సర్కారు..
జిల్లాలో 31,719 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో దాదాపు 3.35లక్షల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. అర్హత ఉన్న ప్రతి మహిళా సంఘానికి గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకుల నుంచి లింకు రుణాలందిస్తోంది. ఈ రుణాన్ని పొందిన మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఈ రుణాలను ఏవిధమైన వడ్డీ లేకుండా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో సంఘాలు సైతం మొగ్గుచూపాయి. దీంతో జిల్లాలో దాదాపు అన్ని సంఘాలు అర్హత ప్రకారం రుణాలు పొందాయి. అయితే రుణ చెల్లింపుల్లో భాగంగా సంఘాలు ముందుగా వడ్డీ డబ్బులు సైతం బ్యాంకులో చెల్లించాల్సి ఉంటుంది.

అలా చెల్లించిన తర్వాత సకాలంలో రీపేమెంట్ చేసిన సంఘాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బును తిరిగి ఖాతాలో జమ చేస్తుంది. ఇందులో భాగంగా 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు మహిళా సంఘాలు వడ్డీ రూపంలో రూ.106.36 కోట్లు చెల్లించినట్లు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మూడేళ్లకు సంబంధించి కేవలం రూ. 56.59 కోట్లు మాత్రమే విడుదల చేసి మమ అనిపించింది. ఇంకా రూ. 49.74 కోట్లు రావాల్సి ఉండగా.. సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
 
వడ్డీపై వడ్డీ..
లింకు రుణాలు పొందిన సంఘాల నుంచి బ్యాంకులు ముక్కుపిండి మరీ వసూళ్లకు ఉపక్రమిస్తున్నాయి. వాస్తవానికి వడ్డీ లేని రుణాలను ముందస్తుగా మంజూరు చేస్తే సంఘాల సభ్యులకు ఊరట లభించేంది. అదేవిధంగా తిరిగి చెల్లింపులు సైతం ఉత్సాహంతో చేసేవారు. కానీ రుణ మొత్తానికి సంబంధించి చెల్లింపులు వందశాతం పూర్తయిన తర్వాత వడ్డీ రాయితీ కల్పించడం సంఘాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. బ్యాంకులు మాత్రం రాయితీ ప్రక్రియతో సంబంధం లేకుండా వడ్డీని కలిపి వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో సరిగ్గా చెల్లింపులు చేయని సంఘాలపై వడ్డీ డబ్బులపైనా అదనంగా వడ్డీ వసూలు చేస్తున్నట్లు పలువురు మహిళలు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు