మహిళా సంఘాలకు న్యాయం జరిగేనా !

8 Jan, 2015 05:11 IST|Sakshi

ఆర్మూర్ : మహిళా సంఘాల సభ్యుల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్న మెప్మా ఉద్యోగుల బండారం ఒకటొకటిగా బయటపడుతుండటంతో ఉద్యోగులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించే సమయంలో మెప్మా ఉద్యోగులు మహిళా సంఘాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విషయం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితం కావడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.

జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ సీరియస్ అయి విచారణ కోసం మెప్మా అర్బన్ పీడీ సత్యనారాయణను విచారణ జరపాల్సిందిగా ఆర్మూర్‌కు పంపించారు. దీంతో ఈ విషయం కాస్త హైదరాబాద్‌లో ఉన్న మెప్మా ఎండీ అనితా రాంచంద్రన్ దృష్టికి వెళ్లినట్లు సమాచా రం. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన ఎండీ బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని సూచించినట్లు సమాచారం. ఆర్మూర్ పట్టణంలో 742 మహిళా సంఘాలతో 29 మహిళా సమాఖ్యలు ఉండగా 2014-15 ఆర్థిక సంవత్సరానికి 190 సంఘాలకు రూ. 4 కోట్ల 5 లక్షల బ్యాంకు రుణాలు ఇప్పించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఉన్నతాధికారులు టార్గెట్ విధించారు.

ఇప్పటికే ఆర్మూర్ పట్టణంలోని 138 సంఘాలకు రూ. 3 కోట్ల 74 లక్షల మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిం చారు. అయితే ఈ రుణాలు ఇప్పించే సమయంలో మహిళా సంఘాల మినిట్స్‌బుక్స్ రాస్తూ బ్యాంక్ డాక్యుమెంట్లు సిద్ధం చేసే కొందరు రీసోర్స్ పర్సన్ (ఆర్పీ)లు ఈ డాక్యుమెంట్లను పరిశీలించి బ్యాంకర్లతో మాట్లాడి రుణం ఇప్పించాల్సిన కమ్యూనిటీ ఆర్గనైజర్ (సీవో) బలవంతపు వసూళ్లకు తెరలేపారు.

బ్యాంకు రుణం ఇప్పించినందుకు ప్రతీ సంఘం నుంచి రూ. ఐదు వేల నుంచి రూ. పది వేల వరకు వసూళ్లు చేసారు. ఈ విషయం కాస్త బయటికి పొక్కింది. విచారణ కమిటీని నియమించిన పీడీ సత్యనారాయణ వారం, పది రోజుల్లో జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామన్నారు. అయితే మహిళా సంఘాల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు వచ్చిన సమయంలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మరో వైపు అధికారులు పేర్కొంటున్నారు.

అయితే ఆర్పీలు తాము డబ్బులు తీసుకున్న సంఘాల వారికి తిరిగి ఇచ్చేస్తూ తమపై విచారణ కమిటీకి ఫిర్యాదు చేయవద్దని విన్నవించుకుంటున్నారు. కాగా పూర్తి స్థాయి విచారణ జరిపి అక్రమార్కులు మహిళా సంఘాల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇప్పించి తమకు న్యా యం చేయాలని మెప్మా ఉన్నతాధికారులను కోరుతున్నారు.
 
సమావేశం నిర్వహించాలి..
ఆర్పీలు, సీవో బెదిరింపులకు భయపడుతున్న మహిళా సం ఘాల సభ్యులందరినీ ఒక్కచోటికి చేర్చి సమావేశం నిర్వహించి బలవంతపు వసూళ్ల విషయంలో విచారణ జరిపితే నిజానిజాలు బయటికి వస్తాయని మహిళా సంఘాల నాయకులు విచారణ కమిటీ అధికారులను కోరుతున్నారు.  

విచారణ కమిటీలో ఉన్న మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీఎంసీ ఐబీ మాధురీలత, డీఎంసీ బ్యాకు లింకేజీ మాజీ అధికారి మోహన్‌రావు రహస్యంగా విచారణ జరిపితే మాత్రం అక్రమార్కులు మహిళలను భయపెట్టి విచారణను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందన్నారు. సభ్యులందరితో సమావేశం నిర్వహిస్తే మహిళలు ధైర్యంగా నిజాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు. కాగా బుధవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం కారణంగా మున్సిపల్ కమిషనర్ విధి నిర్వహణలో బిజీగా ఉండటంతో విచారణ ప్రారంభించలేరు.
 
మున్సిపల్ చైర్ పర్సన్ సీరియస్..

ఇదిలా ఉండగా పట్టణంలోని మహిళలను మెప్మా ఉద్యోగులు వేధింపులకు గురి చేయడంపై మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి సింగ్ సీరియస్ అయ్యారు. మెప్మా ఉద్యోగులను బుధవారం కార్యాలయంలోకి పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసారు.

>
మరిన్ని వార్తలు