నిరసన బతుకమ్మ

24 Sep, 2014 23:53 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పెద్దల పండగ పెతరమాస వేళ ఎంగిలి పూల రాగాలతోనే పల్లెలు నిద్ర లేస్తాయి. తీరొక్క పువ్వేసి  బతుకమ్మలు ఆడుతాయి. పడుచు పిల్లల దగ్గర నుంచి పండుటాకుల వరకు కొత్త చీరలుకట్టి వంటి నిండా నగలు సింగారించుకొని ఆడుతారు..పాడుతారు.  సొంత రాష్ట్రంలో తొలి వేడుకలు ప్రభుత్వమే అధికారికంగా చేపట్టిన వేళ పండగ శోభ మరింత సంతరించుకోవాలి. కానీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఈ సీన్ రివర్స్ అయ్యింది.

ఉత్సాహంగా ఆడిపాడుతూ బతుకమ్మ ఆడాల్సిన మహిళలు.. బుధవారం ఎస్‌బీహెచ్ బ్యాంకు ముందు తమ కష్టాలను కైగట్టి పాడారు. తమ నిరసనను పాట రూపంలో చెబుతూ ఎంగిలి పూలతోనే బతుకమ్మ ఆడారు. సొమ్ములు లేకుండా సంబురాలు ఎట్టాచేసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు.

 ఎందుకిలా అంటే...
 ఐదేళ్ల నుంచి కరువు కాటేయడంతో రైతులు అప్పుల పాలయ్యారు. మహిళల ఒంటి మీద పుస్తేల దగ్గర నుంచి మొదలు పెట్టి కాళ్ల మెట్టెల వరకు బ్యాంకులో కుదవబెట్టి పంట రుణాలు తీసుకున్నారు. కానీ కాలం కలిసి రాక పెట్టిన పెట్టుబడి మట్టిలోనే కలిసిపోయింది. సాధారణ ఎన్నికల వేళ గులాబి దళపతి ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతు రుణ మాఫీకి ప్రాముఖ్యత ఇవ్వడంతో, ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొబెట్టారు.

 అయితే సీఎం కేసీఆర్ రైతు రుణాల మీద రోజుకో ప్రకటన చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు రైతు రుణాలు మాఫీ  కాలేదు.  జిల్లా వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది రైతులకు సుమారు రూ.3,321 కోట్ల రుణాలు ఉన్నాయి. ఇందులో దాదాపు రూ.184 కోట్ల బంగారు రుణాలు ఉన్నాయి. గత ఏడాది దాదాపు 50 వేల మంది  మహిళలు నగలు తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు.  పంట రుణాలు మాఫీ చేశామని, కొత్త పంట లోన్లు కూడా ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించినట్టు  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసినప్పటికీ ఇంత వరకు రుణాలు మాఫీ కాలేదు. దీంతో  గజ్వేల్ నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన మహిళలు బుధవారం బ్యాంకు ఎదురుగానే బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు.

మరిన్ని వార్తలు