హాల్‌ టికెట్లలో వింతలు   

18 May, 2018 12:53 IST|Sakshi
పూలచిత్రం వచ్చిన విద్యార్థి వివరాలు

నివ్వెరపోయిన  పీజీ విద్యార్థులు

అభ్యర్థుల ఫొటోలకు బదులు పూలు, ఇతర చిత్రాలు

35 మంది విద్యార్థులకు ఇలాగే..

గంట తర్వాత కేంద్రంలోకి అనుమతించిన నిర్వాహకులు

శాతవాహనయూనివర్సిటీ : కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులు పీజీ పరీక్షల హాల్‌టికెట్లు చూసి నివ్వెరపోయారు. శాతవాహనయూనివర్సి టీ పరిధిలోని కళాశాలల్లో పీజీ రెండో సెమి స్టర్‌ పరీక్షలు 17 తేదీ నుంచి 29 వరకు జరగనున్నాయి. మొదటి రోజైన గురువారం ఫండమెంటల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించారు. పరీక్షల  హాల్‌టికెట్‌లలో అందరికీ అభ్యర్థుల ఫొటోలు ముద్రణ కాగా.. పలువురు విద్యార్థులకు మాత్రం తమ ఫొటోలకు బదులు పూల చిత్రాలు, సినీతారల ఫొటోలు వచ్చాయి.

దాదాపుగా 35 మంది విద్యార్థులకు ఇలాగే జరిగింది. అవి చూసి ఖంగుతిన్న విద్యార్థులు పూలచిత్రాల స్థానంలో వారి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు అతికించి కళాశాల స్టాంప్‌ వేయించుకుని వచ్చారు. వీటిని చూసిన సెంటర్‌ సిబ్బంది లోనికి అనుమతించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం  కేంద్రం నిర్వాహకులు శాతవాహనయూనివర్సిటీ అధికారులతో మాట్లాడి.. తప్పులు దొర్లిన విద్యార్థులతో అండర్‌ టేకింగ్‌ లెటర్‌ రాయించుకుని లోనికి అనుమతించారు.

ఇదంతా పూర్తయ్యేసరికి గంట సమయం పట్టడంతో విద్యార్థులు గంట ఆలస్యంగా పరీక్షా కేంద్రంలోకి వెళ్లారు. మరో పరీక్షకు హాల్‌టికెట్లు ఇలాగే తీసుకొస్తే లోనికి అనుమతించమని.. ప్రిన్సిపాల్‌ స్టాంప్, సంతకంతో ఉంటేనే పంపిస్తామని నిర్వాహకులు సూచించడం గమనార్హం. సాధారణంగా కళాశాల నుంచి అభ్యర్థుల ఫొటోలు, వివరాలు యూనివర్సిటీకి అప్‌లోడ్‌ చేస్తారు. అనంతరం యూనివర్సిటీ అధికారులు వాటిని పరీక్షించి సరిగా ఉన్నాయా లేదా చూసి హాల్‌టికెట్‌లు జారీ చేస్తారు.

ఇది కళాశాల తప్పిదమా.. యూనివర్సిటీ తప్పిదమా అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. గతంలో పరీక్షల విషయంలో ఎన్నో తప్పిదాలు దొర్లినప్పటికీ శాతవాహన పరీక్షల విభాగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తప్పుమీద తప్పులు చేస్తూనే ఉందని.. నిర్లక్ష్యం వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

విద్యార్థులకు నష్టం జరగనివ్వం..

పీజీ విద్యార్థులకు హాల్‌టికెట్‌లో ఫొటోలకు బదులు వేరే చిత్రాలు వచ్చింది వాస్తవమే. వారి  కళా శాల నుంచే అప్‌లోడ్‌ చేయడం, ఇతర టెక్నికల్‌ కా రణాలతో ఇది జరిగింది. పరీక్షా కేంద్రానికి యూ నివర్సిటీ నుంచి సమాచారమందించి విద్యార్థుల ను లోనికి అనుమతించాం. విద్యార్థులు ఆలస్యం గా వెళ్లినా నిర్ణీత సమయం అందించడంతో పరీక్ష పూర్తి చేసుకున్నారు.

 – డాక్టర్‌ వి.మహేశ్, ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌

మరిన్ని వార్తలు